పవన్ కల్యాణ్, చంద్రబాబు
సాక్షి, అమరావతి : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తమ పరపతి కాపాడుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ఉద్యమాన్ని పవన్ కల్యాణ్ మీద వేసి బలిచేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను బీజేపీ నాయకులకు దూరం చేశారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం రోడ్డెక్కాలని సూచించారు.
తిరుపతి సభలో ఆంధ్రప్రదేశ్‌కు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని అన్న చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో రాజీ పడి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని విమర్శించారు. ఎన్నికల హామీల అమలు గురించి తాను, ఇతర బీజేపీ నేతలు ప్రశ్నిస్తే వైఎస్ జగన్‌కు అమ్ముడు పోయారని ఎదురు దాడి చేయడం తెలుగుదేశం నాయకులకు అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు.
ప్రత్యేక హోదా, విభజన హమీలు రాష్ట్రానికి తేవాలంటే వైఎస్ జగన్, పవన్ కల్యాణ్, తనలాంటి వారు ఏ ఒక్కరో సరిపోరని ఆయన అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంపై ఏమాత్రం ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధిపై అభిమానం ఉంటే ఓటుకు నోటు కేసుకు భయపడకుండా కేంద్రంలో తమ పార్టీ మంత్రులను, ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటూ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుండి నడిపించాలన్న ఆయన, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నరని పేర్కొన్నారు. చరిత్రలో గొప్పవారిగా ఉండటానికి ప్రయత్నించాలని, చెడ్డవారుగా మిగిలిపోవద్దంటూ చంద్రబాబును ఉద్ధేశించి అన్నారు. రాష్ట్రం కోసం నిస్వార్ధంగా పనిచేయాలని, అంతే కాని వేదాలు వల్లించొద్దంటూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment