ఇకపై లే అవుట్ క్రమబద్ధీకరణ గుదిబండే!
- ఎల్‌ఆర్‌ఎస్‌కి దరఖాస్తు చేసుకోని వారికి భారీ జరిమానాలతో మరో అవకాశం
- 33% అదనపు ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు, 14% ప్రస్తుత మార్కెట్ ధర కలిపి చెల్లించాలి
- పురపాలక శాఖ ఉత్తర్వులపై బిల్డర్ల అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ గుదిబండగా మారనుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తు చేసుకోని వారి భూములు/లే అవుట్ల క్రమబద్ధీకరణకు భారీ జరిమా నాతో మరో అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఇళ్ల నిర్మాణాలకు పెనుభారంగా మారాయి. 2015 నవంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ గడువు ఇప్పటికే ముగిసింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ కింద దరఖాస్తు చేసుకోని వారి లే అవుట్లు, ప్లాట్లు, భూముల్లో ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే సమయంలో భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేసి సంబంధిత లే అవుట్లు, ప్లాట్లు, భూములు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ గత నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది.
వీటినే రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తింపజేస్తూ గత నెల 28న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఉత్తర్వుల ప్రకారం...ఇకపై లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నాటి ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలకు అదనంగా జరిమానాల రూపంలో మరో 33 శాతం ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలను చెల్లించాలని, దీనికి తోడు భూమి ‘ప్రస్తుత మార్కెట్ విలువ’లో 14 శాతాన్ని ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీల రూపంలో చెల్లించాలి.
బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థల ఆందోళన
ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 14 శాతం ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించాలని తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారుతుందని బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన భూముల మార్కెట్ ధరలు ప్రస్తుతం ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. గతంలో కొనుగోలు చేసిన భూముల మొత్తం ధరతో పోల్చితే ప్రస్తుత మార్కెట్ విలువలో 14 శాతమే అధికంగా ఉంటుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలకు అదనంగా విధించిన 33 శాతం చార్జీలతో చెప్పుకోదగ్గ భారం పడకపోయినా, దీనికి అదనంగా 14 శాతం మార్కెట్ విలువను సైతం ఓపెస్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలుగా చెల్లించాలని ఆదేశించడం పట్లే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే లే అవుట్ల క్రమబద్ధీకరణకు జరిమానాలతో ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలూ వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించడంతో భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత క్లిష్టంగా మారుతుందని పురపాలక శాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువకు బదులు భూమి కొన్ననాటి విలువ ప్రకారం ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు వసూలు చేస్తే నిర్మాణ రంగానికి ఊరట లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.