ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్‌పై ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా దాడిచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. హోలీ వేడుకల అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు స్నానం చేసేందుకు తన బైక్‌పై ఆకులవారి ఘణపురం జాతీయ రహదారిలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ముజామిల్, సాబీర్‌హుస్సేన్, ఫరీద్, యాకూబ్, సల్మాన్ అనే వారు స్నానం చేస్తున్నారు. గతంలో శివకుమార్ వారిపై కొన్ని వార్తలు రాశాడు.
ఈ క్రమంలో స్నానం చేస్తున్న శివతో మిగతా ఐదుగురు నువ్వు ఎలాంటి వార్తలు రాసినా మాకు ఏమీ కాదు’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఇలా మాటా మాటా పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో వారు శివపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేయగా శివ పారిపోయాడు. అక్కడ నిలిపిన అతడి ద్విచక్రవాహనాన్ని యాకూబ్, అతడి అనుచరులు తగలబెట్టారు. అనంతరం శివ యాకూబ్‌తోపాటు మిగితా నలుగురు తనపై హత్యాయత్నం చేశారని, ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, శివ కూడా తనను తలపై కొట్టి గాయపరిచాడని యాకూబ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తె నరేష్ తెలిపారు.
విలేకరిపై హత్యాయత్నం
Published Wed, Mar 23 2016 10:08 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
Advertisement