andhraprabha
-
వాసుదేవ దీక్షితులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు (76) శుక్రవారం కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. పత్రికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా ఆయనకు మంచిపేరు ఉంది. వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీక్షితులు మృతిపై సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గుండెపోటుతో మృతిచెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా పనిచేసిన దీక్షితులు మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. దీక్షితులు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
విలేకరిపై హత్యాయత్నం
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివకుమార్‌పై ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా దాడిచేసి, ఒంటిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. హోలీ వేడుకల అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు స్నానం చేసేందుకు తన బైక్‌పై ఆకులవారి ఘణపురం జాతీయ రహదారిలోని జంపన్నవాగు బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ముజామిల్, సాబీర్‌హుస్సేన్, ఫరీద్, యాకూబ్, సల్మాన్ అనే వారు స్నానం చేస్తున్నారు. గతంలో శివకుమార్ వారిపై కొన్ని వార్తలు రాశాడు. ఈ క్రమంలో స్నానం చేస్తున్న శివతో మిగతా ఐదుగురు నువ్వు ఎలాంటి వార్తలు రాసినా మాకు ఏమీ కాదు’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఇలా మాటా మాటా పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో వారు శివపై పెట్రోల్ పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేయగా శివ పారిపోయాడు. అక్కడ నిలిపిన అతడి ద్విచక్రవాహనాన్ని యాకూబ్, అతడి అనుచరులు తగలబెట్టారు. అనంతరం శివ యాకూబ్తోపాటు మిగితా నలుగురు తనపై హత్యాయత్నం చేశారని, ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, శివ కూడా తనను తలపై కొట్టి గాయపరిచాడని యాకూబ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తె నరేష్ తెలిపారు. -
ఆంధ్రప్రభ ఇన్చార్జ్ ఎడిటర్ అరెస్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆంధ్రప్రభ పత్రిక ఇన్చార్జి ఎడిటర్ చంద్రశేఖర్, భద్రాచలం విలేకరి షేక్‌మహబూబ్, సబ్ ఎడిటర్ విజయలక్ష్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మహ్మద్ ప్రవక్త బొమ్మను వేశారంటూ పలు ముస్లిం సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. నాలుగు రోజుల నుంచి పలువురు ముస్లింలు పత్రికా కార్యాలయం వద్ద, పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాయి.