తనను అసభ్యకరంగా దూషిస్తున్నారంటూ 13 ఏళ్ల బాలుడితో పాటు 70 ఏళ్ల వృద్ధులపై కేసు పెట్టిన యాంకర్ గీతా భగత్ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. తన భర్త మధుకర్‌తో గీతా భగత్ చాలా కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని బాలుడి తల్లి శ్వేత ఆరోపించారు. ఆమె తమను గత ఎనిమిదేళ్లుగా మానసికంగా వేధిస్తోందని అన్నారు. వాళ్లిద్దరూ కలిసి ఏదో ఒక రోజు ఆస్తి కోసం తన కొడుకును చంపేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి కోసమే తన కొడుకును టార్చర్ చేస్తున్నారని, ఆ కోపంతో 504, 506, 509 లాంటి సెక్షన్ల కింద కేసు పెట్టారని, 13 ఏళ్ల పిల్లాడికి అసలేం తెలుసని ఇలాంటి కేసులు పెడతారని ఆమె ప్రశ్నించారు. తన భర్తను వాళ్లు పనిమనిషిలా చూస్తున్నారని అన్నారు. తమకు సరిగా న్యాయం చేయకపోతే కొడుకుతో సహా వెళ్లి సనత్‌నగర్ పోలీసు స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. తన కొడుకును పెద్ద చదువులు చదివించాలని తాను ఆశపడుతున్నానని, కానీ ఇప్పుడు ఈ గొడవల్లోకి వాడిని కూడా లాగి వాడి భవిష్యత్తు నాశనం చేస్తున్నారని వాపోయారు. అంత చిన్న పిల్లాడిపై అసలు క్రిమినల్ కేసు ఎలా పెడతారని శ్వేత తప్పుబట్టారు. గీతాభగత్ తమను మానసికంగా వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుక్కి న్యాయం చేయాలని కోరుతూ ఆమె బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే బాలుడి తల్లి శ్వేత చేసిన ఆరోపణలపై స్పందించేందుకు యాంకర్ గీతా భగత్ నిరాకరించారు.
మార్చి 6వ తేదీన ఇంట్లో పెద్ద గొడవ అయ్యిందని బాలుడు కూడా చెప్పాడు. పోలీసుల ముందే వాళ్లు తన తల్లి శ్వేతను కొట్టారని, అదేంటి కొడుతున్నారని తాను ఆపబోతే.. అసలు వాళ్లను కాదు నిన్ను కొట్టాలంటూ తనను కూడా కొట్టారని చెప్పాడు. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టుకుని తనను, తన తల్లిని తిడుతుంటారని, అంతేతప్ప తాను ఏరోజూ ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదని అన్నాడు.
కాగా, తనను దూషించడంతో పాటు అసభ్యకరంగా వ్యవహరించారని గీతాభగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు బాలుడితో పాటు ఇద్దరు వృద్ధులు, శ్వేతపై కేసు నమోదు చేశారు. బాలుడు (13), అతడి తల్లి శ్వేత (36), అమ్మమ్మ రాజకుమారి (74)తో పాటు పక్కింట్లో ఉండే సుబ్బారావు (70)లపై గీతాభగత్ ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు 504, 506, 509, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.