నగర కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన నరసింహన్
సాక్షి, హైదరాబాద్: పోలీసు చరిత్రలో తొలిసారి గవర్నర్ నరసింహన్ శనివారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని రెండున్నర గంటలపాటు సందర్శించడం ఆసక్తి రేపింది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డిలతో గవర్నర్ సమావేశం కావడం సంచలనం కలిగిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ పర్యవేక్షించబోతున్నారనడానికి ఇది సంకేతమని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలు గవర్నర్ పర్యవేక్షణలోనే ఉంటాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ మొదలు కమిషనర్ దాకా పోస్టింగులు, బదిలీలు గవర్నర్ పరిధిలోకే వస్తాయని చట్టంలో పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని చట్టంలో పేర్కొన్నప్పటికీ నరసింహన్ ఇప్పటివరకు జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. అయితే గవర్నర్ తెలంగాణ సర్కారుకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా చట్టంలో పేర్కొన్న అంశాలను పట్టించుకోవట్లేదని కేంద్రానికి ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఎంసెట్ ఎవరు నిర్వహించాలనే విషయంలో గవర్నర్ సరైనరీతిలో వ్యవహరించలేదని కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ చర్య సంచలనంగా మారింది. నగర శాంతి భద్రతల పరిస్థితిని పరిశీలించడం తెలంగాణ ప్రభుత్వానికి విస్మయం కలిగించింది. గవర్నర్ వ్యవహారశైలిపై ప్రభుత్వ ముఖ్యులు అసంతృప్తితో ఉన్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇకపై హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షిస్తారన్న ప్రచారం తెలంగాణ ప్రభుత్వానికి కలవరపాటు కలిగించినట్లు ఆ వర్గాల సమాచారం.