బాబు సైగలతో పనిచేయడం మానుకోవాలి
తెలంగాణ టీడీపీకి హోం మంత్రి నాయిని సూచన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసైగలతో తెలంగాణ టీడీపీ నేతలు పని చేయడం మానుకోవాలని, వారు తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. బుధవారం మినిష్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో నాయిని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్రా పార్టీ అవసరమా అని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలంటూ చంద్రబాబు ఢిల్లీలో లాబీయింగ్ చేశారని విమర్శించారు.
హైదరాబాద్‌కు ఈ నీళ్లు వస్తే ఆంధ్రవాళ్లు తాగరా అని ప్రశ్నించారు. ఇక్కడున్న ఉన్న ఆంధ్రావాళ్లంతా తమవారేనని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య చంద్రబాబు తన కుయుక్తులతో తగాదాలు పెంచుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించడం, మత సామరస్యాన్ని కాపాడేందుకు కలిసిరావాలని ఎంఐఎంతో అవగాహన మాత్రమే కుదుర్చుకున్నామని, వారితో తమకు పొత్తు లేదని వెల్లడించారు.