నవ వధువు కిడ్నాప్ | New bride kidnapping | Sakshi
Sakshi News home page

నవ వధువు కిడ్నాప్

Published Sat, Jul 25 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

New bride kidnapping

అమ్మాయి తల్లిదండ్రులేనంటున్న భర్త
 ప్రేమపెళ్లి ఇష్టం లేకపోవడమే   కారణమని ఫిర్యాదు
 ఏసీపీ జోక్యంతో కేసు నమోదు


 హయత్‌నగర్:  పెళ్లయిన వారం రోజులకే.. ఓ నవ వధువు కిడ్నాప్‌నకు గురైంది. ప్రేమ పెళ్లి ఇష్టం లేని వధువు తల్లిదండ్రులే తన భార్యను అపహరించారని భర్త ఆరోపిస్తున్నాడు. శుక్రవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినిపల్లికి చెందిన మేడిడి బాలకోటయ్య కుమారుడు శివకృష్ణ (24), ఇదే ప్రాంతంలోని వెల్లపాలేనికి చెందిన నూతలపాటి వెంకటేశ్వరరావు కూతురు గౌతమీకీర్తి (25) వరుసకు బావా మరదళ్లు. వీరిరువురూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి పెద్దలు అంగీకరించరనే కారణంతో ఈ నెల 18న జీడిమెట్లలోని ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు.

అప్పటి నుంచి హయత్‌నగర్ డివిజన్‌లోని విజయపురి కాలనీలో కాపురం పెట్టారు. శివకృష్ణ పెద్దఅంబర్‌పేట సమీపంలోని ఓ ఆలయంలో పని చేస్తుండగా.. గౌతమి బేగంపేటలో కన్సల్టెన్సీ కార్యాలయంలో జాబ్ చేస్తోంది. ఎప్పటిలాగే విధులకు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో గౌతమి హయత్‌నగర్ బస్టాప్ వద్దకు చేరుకుంది. అనంతరం కొద్ది సేపటికే ఆమె ఫోన్ నుంచి శివకృష్ణకు కాల్ వచ్చింది. ఫోన్‌లో అరుపులు, కేకలు వినిపించాయి. కొద్దిసేపటికి గౌతమి ఫోన్ ఆఫ్ అయింది. దీంతో కంగారు పడ్డ అతను హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు పరుగు తీశాడు. ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగినట్లు చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లాలని సూచించారు. చివరకు ఏసీపీ జోక్యంతో హయత్‌నగర్  కిడ్నాప్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement