పంజగుట్ట (హైదరాబాద్) : నిమ్స్‌ను దేశంలోనే ప్రతిష్టాత్మక ఆసుపత్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు నిమ్స్ డెరైక్టర్ మనోహర్ అన్నారు. ఆదివారం ఎర్రమంజిల్ పంచాయతీరాజ్ కార్యాలయం ఎదురుగా 520 గజాల స్థలంలో కోటి 40 లక్షల వ్యయంతో నిమ్స్ పేషెంట్స్ అటెండర్స్ కోసం నూతన భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రౌండ్‌తో పాటు రెండు ఫ్లోర్లు జీహెచ్‌ఎంసీ అనుసంధానంతో నిమ్స్ ఆసుపత్రి నిర్మించగా మరో మూడు ఫ్లోర్లు క్యాన్సర్ ఆశ్రయం ట్రస్ట్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యంగా డయాలసిస్, రేడియేషన్ పేషెంట్ల సహాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిమ్స్ వర్గాలు వెల్లడించాయి. 200 మందికి పైగా బసచేసేందుకు వీలుగా నిర్మిస్తున్నట్లు, ఒక్కో ఫ్లోర్‌లో సుమారు 38 గదులు, స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా ఒక్కో ఫ్లోర్‌లో 18 స్నానాల గదులు, 18 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
భవిష్యత్‌లో ఈ భవనం మెయింటెనెన్స్ రోటరీ క్లబ్‌కు అప్పగించే దిశగా ఆలోచిస్తున్నట్లు, జీహెచ్‌ఎంసీ అధికారులతో మాట్లాడి రూ.5 భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసే యత్నం చేస్తామని తెలిపారు. దీపావళి వరకు దీనిని ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు నిమ్స్ డెరైక్టర్ వెల్లడించారు. ఎర్రమంజిల్‌లో నిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన 16 ఎకరాల స్థలం ఉందని అందులో నెఫ్రాలజీ, యూరాలజీ టవర్స్‌తో పాటు, ఆడిటోరియం, డాక్టర్స్‌కు, రెసిడెన్స్ వైద్యులకు, స్టాఫ్‌కు క్వార్టర్లు కట్టించడంతో పాటు, డెరైక్టర్ భవనం కట్టించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌కు వచ్చే ప్రతీ రోగీ సంతోషంగా నవ్వుతూ ఇంటికి వెళ్లేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని వైద్యపరికరాలు అందుబాటులోకి తెచ్చి మరిన్ని వసతులు కల్పించి రోగులకు సేవలందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి, ఆర్‌ఎంఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
'దేశంలోనే ప్రతిష్టాత్మక ఆస్పత్రిగా నిమ్స్'
Published Sun, Jul 3 2016 4:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM
Advertisement
Advertisement