కొత్త జిల్లాల మ్యాప్‌లు విడుదల
సంక్షిప్త సమాచారంతో బుక్‌లెట్లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన జిల్లాలతో రాష్ట్ర పరిపాలన స్వరూప చిత్రపటాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల భౌగోళిక స్థితిగతులు, డివిజన్లు, మండలాలు, జనాభా, కుటుంబాలు, సామాజిక ఆర్థిక రంగాలు, మౌలిక వసతులు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రగతిని సూచించే గణాంకాలను ఇందులో పొందుపరిచింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మ్యాప్‌లు, శాఖల వారీ సమాచారం అందుబాటులో లేకపోవటం కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లు, ఎస్పీలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న పాత పది జిల్లాల గణాంకాల ఆధారంగా 31 జిల్లాల చిత్రపటాలు, జిల్లాకు సంబంధించిన సంక్షిప్త సమాచారమున్న బుక్‌లెట్లను ప్రణాళిక శాఖ రూపొందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో బుక్‌లెట్లను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అందజేశారు.
పరిపాలన విభాగాలు, 2011 జనాభా వివరాలు, కుటుంబాలు, అక్షరాస్యత, ఎస్సీ, ఎస్టీ జనాభా, సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కుటుంబాలు, సామాజిక వర్గాల వారీగా జనాభా, సాగు విస్తీర్ణం, వివిధ పంటల సాగు, పశు సంపద, వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు. విద్య, ఆసరా పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ, సాదా బైనమాల రిజిస్ట్రేషన్, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, అసైన్డ్ భూములు, విద్యుత్తు, రోడ్లు, రవాణా, హరితహారం వార్షిక లక్ష్యం, నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, పరిశ్రమలు, టీఎస్‌ఐ పాస్, గనులు, చేనేత, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల్లో పన్నుల వసూలు, పోస్టాఫీసులు, బ్యాంకులు, పర్యాటక సాంస్కృతిక వివరాలను ఇందులో ప్రస్తావించింది.