కొత్త చరిత్రకు శ్రీకారం
టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా అవతరించింది: కే టీఆర్
ఇది అపూర్వ విజయం
ఫలితాలు సీఎం దీక్షాదక్షతకు గీటురాయి
బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. టీఆర్‌ఎస్ ఇప్పటికే కేసీఆర్ ఆధ్వర్యంలో చరిత్ర తిరగరాసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఇది. టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ప్రజల దీవెనలు, హైదరాబాద్‌లోని సబ్బండవర్ణం ఆదరించింది. అందుకే అపూర్వ విజయం సొంత మైంది. మా గెలుపు పరిపూర్ణం. కుల, మత, ప్రాంతాలకు అతీతం గా అభివృద్ధి చేసి ఇదే పరంపరను కొనసాగి స్తాం..’’ అని మంత్రి కె.తారకరామారావు అన్నారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్ లతో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దీక్షా దక్షతకు, పనితీరుకు గీటురాయి అని అన్నారు.
అపూర్వమైన విజయం అందించిన నగర ప్రజలకు శిరసు వహించి ధన్యవాదాలు తెలుపుతున్నామని, జీహెచ్‌ఎంసీ మేనిఫెస్టోను అమలు చేస్తామని తెలిపారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు ఉన్న ఆదరణ, కేసీఆర్‌కు ఉన్న పట్టు రుజువైందని, ఈ ఫలితాలతో తమ బాధ్యత పదింతలైందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఇకనైనా మారుతాయని భావిస్తున్నామని అన్నారు.