లోటు పూడ్చేందుకు కొత్త ఎత్తిపోతల పథకం
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకానికి(ఆర్డీఎస్) ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మహబూబ్‌నగర్ జిల్లా అయిజా మండలం తుళ్లూరు వద్ద సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోసేలా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మొత్తంగా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా ఆర్డీఎస్ పరిధిలోని 74 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా దీన్ని తీర్చిదిద్దారు. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది.
ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరు నీరు రావట్లేదు. దీంతో ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న ఏపీలోని కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డుతగులుతుండటంతో 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావట్లేదు. దీంతో కేవలం 30 వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా నీరందుతోంది.
సిద్ధమైన ప్రతిపాదనలు
ఆర్డీఎస్ కింద ఉన్న కేటాయింపులను సమర్థంగా వాడుకునేందుకు అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే మేలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముసాయిదా ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారు చేశారు. తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను తుమ్మిళ్ల వద్ద నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో మూడు చిన్న పాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ తుది ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా 90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీనికి రూ.830 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు.
ఈ ప్రణాళికపై సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు వచ్చినట్లు తెలిసింది. మూడు రిజర్వాయర్‌లు కాకుండా కేవలం ఒక రిర్వాయర్ ద్వారానే నీటిని తరలించేలా ప్రత్యామ్నాయం అధ్యయనం చేయాలని, వీలుంటే కొత్తగా మరో 10 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం.
ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణకు ‘తుళ్లూరు’
Published Wed, Jan 27 2016 3:32 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
Advertisement