హైదరాబాద్ : రాజధాని నగరంలో ప్రధాన రోడ్లు జంక్షన్ల వద్ద భారీ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారీగా జన సమీకరణకు కారణమయ్యే మల్టిప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, పెట్రోల్ బంకులను ప్రధాన జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో నిర్మించవద్దని ఆంక్షలు విధించింది. నగరంలో జంక్షన్ల వద్ద కొత్త భవనాలకు అనుమతులను నిషేధిస్తూ ప్రత్యేక నిబంధనలను జారీ చేయాలని జీహెచ్‌ఎంసీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది.
జంక్షన్ల జామ్‌పై ఆందోళన...
నగరంలో నిత్య నరకంగా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్ట్రేటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ) కింద రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా ఎడమ వైపు(ఫ్రీ లెఫ్ట్) మలుపు తిరిగే అవకాశాన్ని కల్పించేందుకు ... ప్రధాన జంక్షన్ల వద్ద జీహెచ్‌ఎంసీ అదనపు లేన్‌ను నిర్మిస్తుంది. ఇందుకోసం రోడ్లకు ఇరువైపులా భూములను సేకరిస్తోంది.
అయితే ఇప్పటికే ఇరుకుగా మారిన జంక్షన్లకు సమీపంలో భారీ భవనాల నిర్మాణాలు జరుగుతుండడం పట్ల జీహెచ్‌ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి భవనాలకు అనుమతులు జారీపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి నివేదించింది. దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో అమలు చేస్తున్న భవన నిబంధనలతో పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) నియమావళిపై అధ్యయనం చేసిన జీహెచ్‌ఎంసీ... ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ కన్సల్టెంట్లతో సంప్రదింపులు జరిపి జంక్షన్ల వద్ద నిర్మాణాలపై అనుసరించాల్సిన ముసాయిదా నిబంధనలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ నిబంధనలను అమలు చేస్తే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు కొంత మేరకు పరిష్కారం అవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు, పట్టణాల్లో సైతం ఈ నిబంధనలను వర్తింపజేస్తే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
జంక్షన్ల వద్ద ఆంక్షలు ఇలా ఉండనున్నాయి...
- జంక్షన్లకు 300 మీటర్ల వ్యవధిలో జనం గూమికూడడానికి కారణమయ్యే మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, పెట్రోల్ బంక్‌లపై నిషేధం.
- జంక్షన్ల స్ల్పే పోర్షన్ పరిధిలో భవనాల ప్రవేశం, నిష్ర్కమణ ద్వారాలు ఉండరాదు.
- జంక్షన్ల స్ల్పే పోర్షన్‌కు చుట్టూ రెయిలింగ్‌తో రక్షణ కల్పించాలి.
- ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కోసం జంక్షన్ల వద్ద అదనపు లేన్‌ను నిర్మించాలి.
- రోడ్డు వైశాల్యం ఆధారంగా 15-25 మీటర్ల వ్యాసార్థంలో స్ల్పేను విడిచి పెట్టాలి.
- జంక్షన్లకు 300 మీటర్ల పరిధి వరకు వాహనాలను పార్కింగ్ చేయరాదు.
- జంక్షన్లకు 100 మీటర్ల పరిధిలోపు అడ్వర్టైజ్‌మెంట్ హోర్డింగ్‌లపై నిషేధం.
జంక్షన్లపై ఆంక్షలు
Published Fri, Sep 9 2016 7:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
Advertisement