Junctions
-
గజిబిజిగా హనుమాన్ జంక్షన్
నిజామాబాద్ సిటీ : నగరంలో ముఖ్యమైన జంక్షన్లలో హనుమాన్ జంక్షన్(వినాయక్‌నగర్) ఒకటి. హైదరాబాద్ ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న ఈ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ చౌరస్తాలో ఏడాది క్రితం ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాని దీనిని నేటికి ప్రారంభించకపోవటంతో ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళలో చౌరస్తా దాటి ముందుకెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు.. వారంరోజుల క్రితం చౌరస్తాలో ఓ ఆటో బైక్‌ను ఢీకొనటంతో బైక్ ఉన్న ఇద్దరిలో ఒకరికి త్రీవంగా, మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. అలాగే గతంలో డిచ్పల్లి వైపునుంచి వచ్చిన ఓ లారీ ఈ చౌరస్తా నుంచి వంద ఫీట్ల రోడ్డువైపు మలుగింది. ఆ సమయంలో చౌరస్తాలో ఓ వైపు టీవీఎస్ వాహనంపై ఉన్న ఒకరిని లారీ వెనుకవైపు నుంచి ఢీకొన్న ఘటనలో అతనికి కాలు విరిగింది. మరో ఘటనలో బ్యాంక్‌కాలనీకి చెందిన ఒకరు వాకింగ్ చేస్తూ చౌరస్తా వైపు రాగా అదే సమయంలో ఓ బైక్ స్పీడ్‌గా వచ్చి అతడిని ఢీకొట్టగా అతని కాలు విరిగింది. రెండేళ్ల క్రితం డిచ్పల్లికి చెందిన ఒకరు టీవీఎస్పై చౌరస్తా దాటుతుండగా ఓ ఆటో ఇతడిని ఢీకొట్టడంతో అక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా మరికొన్ని ప్రమాద ఘటనలు చోటుచేసుకున్నాయి. సిగ్నల్ లైట్లు అమర్చినా.. హనుమాన్ జంక్షన్లో ప్రమాదాలు నిరోధించేందుకు మున్సిపల్, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కాని కారణం ఏమిటోగాని ఇప్పటికీ వీటిని ప్రారంభించలేదు. నిత్యం వేలాది సంఖ్యలో తిరుగుతున్న ఈ మార్గంపై ఉన్న చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను వెంటనే ప్రారంభించాలని చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదాలు అరికట్టాలి హనుమాన్ జంక్షన్లో ట్రా ఫిక్ సిగ్నల్ మొదలుపెట్టక పోవటంతో తరుచుగా జరు గుతున్న ప్రమాదాలను అరి కట్టాలి. ఈ చౌరస్తా మీదుగా 24 గంటలపాటు వాహనా ల రాకపోకలు కొనసాగుతుంటాయి. ఏ వాహనం ఎటువైపు నుంచి వస్తుందో తెలియకుండా ఉంది. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – సుబ్బారావు, వినాయక్‌నగర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి హనుమాన్ చౌరస్తా మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య గత ఐదేళ్లుగా ఎంతో పెరిగింది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకపోవటంతో తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయాలి. -
Cyberabad: జంక్షన్లు, యూ టర్న్‌లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే వక్రమార్గంలో ప్రయాణాలు, ప్రమాదాలూ తగ్గుతాయి. అలాగే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా పాటిస్తారు. ఈ క్రమంలో సైబరాబాద్‌లో కొత్తగా యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటు అవసరాన్ని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. స్థానికుల నుంచి అభ్యర్థనలను స్వీకరించి, ఆ మేరకు కూడళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాంగ్ రూట్లో వెళుతూ.. ‘నిజమైన వినియోగదారులే.. నిజమైన న్యాయనిర్ణేతలు’ ట్రాఫిక్ నిర్ణయాలలో ఇది అక్షరాలా నిజం. వాహనదారులు కోరిన విధంగా యూటర్న్ ఇస్తే వక్రమార్గంలో ప్రయాణించరు. అలా చేయకపోవటంతో రాంగ్ రూట్లో వెళ్లి ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు గుర్తించారు. అందుకే యూటర్న్లు, జంక్షన్లు, ట్రాఫిక్ మళ్లింపుల ఏర్పాట్లపై స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించాలని నిర్ణయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆయా ఏర్పాట్లతో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం ఉంటుందా? వాహన ప్రమాదాలు తగ్గుతాయా? అసలు అది న్యాయబద్దమైన కోరికేనా వంటి అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కారు పడిందని ఫ్లైఓవరు ఎక్కట్లేదు.. ఖాజాగూడ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైకి ఎక్కకుండా కింది నుంచి వెళ్లి జంక్షన్ దగ్గర కుడి వైపునకు మళ్లుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. కారణమేంటని అధ్యయనం చేయగా.. రెండున్నరేళ్ల క్రితం ఆ ఫ్లైఓవర్ పైనుంచి కారు కిందికి పడిపోవటంతో వాహనదారులు ఇప్పటికీ భయపడుతున్నారని, అలాగే ఆ ఫ్లైఓవర్ డిజైనింగ్‌లోనే లోపాలున్నాయని ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు. ఏ రహదారైనా 90 డిగ్రీల కోణంలో తిరిగేటప్పుడు ఎటు వైపునకు మళ్లుతుందో ఆ వైపు రోడ్డు కొంత వంగి ఉండాలి. లేకపోతే వేగంతో వచ్చే వాహనాలు రోడ్డుకు అనుగుణంగా మళ్లవు. దీంతో ప్రమాదాలు జరుగుతాయి. ప్రస్తుతం బయోడైవర్సిటీ ఫైఓవర్ రోడ్డు డిజైనింగ్‌లో మరమ్మతులు చేయలేం కాబట్టే వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. యూటర్న్, జంక్షన్లు ఇక్కడే.. ఇప్పటివరకు యూటర్న్లు, జంక్షన్ల ఏర్పాటుపై స్థానికుల నుంచి 25కి పైగా అభ్యర్థనలు వచ్చాయని.. సాధ్యాసాధ్యాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత 3 ప్రాంతాలను ఎంపిక చేశామని, మరో 11 ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ► ఐఐఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్ వెళ్లే మార్గంలో కోకాపేట దగ్గర వరుణ్ మోటార్స్ వైపున తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)తో కలిసి జంక్షన్‌ను అభివృద్ధి చేశారు. ► ఏఐజీ ఆసుపత్రి అభ్యర్థన మేరకు గచ్చిబౌలిలోని డెలాయిట్ ఆఫీసు దగ్గర యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. ► గచ్చిబౌలి జంక్షన్ ఇందిరానగర్ దగ్గర యూటర్న్‌ను ఇచ్చారు. ► జీఎంసీ బాలయోగి స్టేడియం ముందు ఉన్న యూటర్న్ తక్కువ విస్తీర్ణం ఉందని వచ్చిన అభ్యర్థన మేరకు వెడల్పాటి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. జంక్షన్లు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష గ్రేటర్ నగరంలో రోడ్ల నిర్వహణతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాలపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్‌పేట హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్పార్‌డీపీ), సమగ్ర రోడ్డు నిర్వహణ (సీఆర్ఎంపీ)లో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందించారు. సీఆర్ఎంపీ ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్లకు సంబంధించిన అన్ని అంశాలపైనా మరింత దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ– రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ సమీక్షించారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పాల్గొన్నారు. (క్లిక్: విలవిలలాడిన ఐటీ సిటీ.. ‘గ్రేటర్’ సిటీ పరిస్థితి ఏంటి?) -
Photo Feature: హైదరాబాద్‌లో జంక్షన్లు జిగేల్!
హైదరాబాద్ నగరంలో జంక్షన్లు జిగేల్మంటున్నాయి. సరికొత్త అందాలతో నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ట్రాఫిక్ ఐలాండ్స్, కూడళ్ల వద్ద ఇబ్బందులు తగ్గించే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టింది. ముఖ్యంగా పాదచారుల కోసం లేన్మార్క్లు, వాహనాలు అతి వేగంగా వెళ్లకుండా రంబుల్ స్ట్రిప్స్ వంటివి ఏర్పాటు చేస్తోంది. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో..వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ ఆయా జంక్షన్లలో నిర్వహించిన ట్రాఫిక్ స్టడీలో గుర్తించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక్కో చోట ఒక్కో థీమ్‌తో ట్రాఫిక్ ఐలాండ్లు, జంక్షన్లను అందంగా తీర్చిదిద్దారు. ఓ చోట కెమెరామెన్...మరోచోట రాతిసోయగం...ఇంకో చోట నీటిని ఒడిసిపట్టాలనే సందేశాత్మక రూపాలను పొందుపర్చారు. – సాక్షి, సిటీబ్యూరో/స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు చింతల్‌కుంట చౌరస్తాలో (ఎల్బీనగర్) శిల్పారామం ఎదురుగా.. జీవీకేమాల్ ఎదురుగా... ఎంజే మార్కెట్ సర్కిల్ సైఫాబాద్‌లో -
'కలర్'ఫుల్
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛ నగరం కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తోన్న జీహెచ్ఎంసీ..ఇక కూడళ్ల బ్యూటిఫికేషన్‌పై దృష్టి సారించింది. సదరు కూడళ్లలో రంగురంగుల పూలమొక్కలు ఉంటే జంక్షన్లు అందంగా ఆకట్టుకునేలా ఉంటాయని భావించింది. స్వచ్ఛ కార్యక్రమాల పేరిట చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేయడం, ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచడమే కాకుండా ప్రముఖ జంక్షన్లు, చౌరస్తాల్లో పూలమొక్కలతో సుందరీకరించాలని నిర్ణయించింది. ఆయా కూడళ్లలో బంతి, చామంతిల వంటి సాధారణ పూలమొక్కలతోపాటు వివిధ రంగులతో ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకునేలా కనిపించేందుకు వివిధ వెరైటీల కాస్మోస్, వింకా రోజ్, ఇంపేషన్స్ బాల్సేమినా, తదితరమైన సీజనల్ పూల మొక్కలను నాటనున్నారు. ఈ పూలమొక్కల జీవితకాలం దాదాపు నాలుగు నెలలే కావడంతో నాలుగు నెలలు గడిచాక తిరిగి మళ్లీ నాటుతారు. ఇలా ఏడాదిలో మూడు పర్యాయాలు ఏ సీజన్లో బతికే పూలమొక్కలను ఆ సీజన్లో నాటనున్నారు. తద్వారా ఎప్పటికప్పుడు తాజాగా, ఆయా పూల రంగులతో జంక్షన్లకు కొత్త అందాలు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో అందాల కోసం బోగన్విల్లా, ప్లుమేరియా వంటివి మాత్రమే నాటేవారు కాగా, ఏడాదిపొడవునా జంక్షన్లు అందంగా కనిపించేందుకు ఈసారి వాటితోపాటు వివిధ రకాల సీజనల్ పూలమొక్కల్ని నాటేందుకు సిద్ధమయ్యారు. తొలిదశలో విశాలమైన కూడళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు. దిగువ ప్రాంతాలను అందాన్నిచ్చే పూలమొక్కలతో తీర్చిదిద్దనున్నారు. సుచిత్రా జంక్షన్, ఎల్బీనగర్ జంక్షన్, నిజాంకాలేజీ జంక్షన్, అసెంబ్లీ ఎదుటనున్న జంక్షన్, ఏక్‌మినార్, రోజ్ఫౌంటెన్, మహారాజా అగ్రసేన్, బేగంపేట రాజీవ్‌గాంధీ జంక్షన్, నాగార్జున సర్కిల్ , బంజారాహిల్స్ రోడ్‌నెం.1, రోడ్‌నెం.2లలో రోడ్ల పొడవునా జీవీకేమాల్ ఎదుట కూడా ఈ పూలమొక్కలు నాటుతారు. మలిదశల్లో మిగతా పెద్ద కూడళ్లలోనూ అందాల మొక్కలను నాటనున్నారు. వర్షాలు పడ్డాక తొలిదశలో కోటి మొక్కలు నాటాలనేది జీహెచ్ఎంసీ లక్ష్యం. ఇందులో ♦ 5 లక్షల మొక్కల్ని జీహెచ్ఎంసీ ఆయా ప్రాంతాల్లో నాటుతుంది. ♦ 5 లక్షల్ని విద్యాసంస్థలు, ఆయా సంస్థల్లో నాటేందుకు కోరిన వారికి అందజేస్తారు. ♦ 5 లక్షల పూలమొక్కలు కూడళ్లలో అందాల కోసం నాటుతారు. ♦ 85 లక్షలు ఇళ్లల్లో నాటుకునేందుకు ప్రజలకు అందజేస్తారు. వీటిల్లో పూలు, పండ్లు, ఔషధ, తదితర మొక్కలున్నాయి. సీజనల్ పూలకు ప్రాధాన్యం ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా జీహెచ్‌ంఎసీలో తొలిదశలో భాగంగా కోటి మొక్కలు నాటాలనేది లక్ష్యం కాగా, వాటిల్లో సీజనల్ ఫ్లవర్ ప్లాంట్స్కూ ప్రాధాన్యమిచ్చాం. వీటిని ఆయా కూడళ్లలో పెంచడం ద్వారా ఆయా మార్గాల్లో వెళ్లేవారికి కనులకింపుగా అందంగా కనిపిస్తాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆదేశాల మేరకు ఈసారి హరితహారంలో భాగంగా జంక్షన్లను పూలమొక్కలతో అందంగా సుందరీకరించేందుకు ప్రాధాన్యమిచ్చాం. ఇప్పటికే కొన్ని జంక్షన్లలో పనులు ప్రారంభమైనప్పటికీ, సరైన వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. తగిన వర్షం పడ్డాక అన్ని కూడళ్లలోనూ వీటిని నాటుతాం. వీటి జీవితకాలం దాదాపు నాలుగునెలలే అయినందున, నాలుగునెలల తర్వాత మళ్లీ కొత్తమొక్కలు నాటుతాం. ఈ సీజన్లో ఐదు లక్షల రంగురంగుల పూలమొక్కలను ఆయా జంక్షన్లలో నాటుతాం.తద్వారా కూడళ్లకు కొత్త అందాలతో కనిపిస్తాయి. – వి.కృష్ణ, అడిషనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ -
జంక్షన్ ‘సుందర్’
సాక్షి, సిటీబ్యూరో: ఓవైపు రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టిన జీహెచ్ఎంసీ... మరోవైపు జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ధిపై దృష్టిసారించింది. ఆయా మార్గాల్లో ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించేలా, ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించేలా రంగురంగుల పూల మొక్కలు ఏర్పాటు చేయనుంది. స్థానిక అంశాల థీమ్‌లతో ఈ పనులు చేపట్టింది. మొత్తం 8 జంక్షన్లలో సుందరీకరణ పనులు చేపట్టనుండగా... సుచిత్ర స్క్వేర్, మెట్టుగూడ, ఎల్బీనగర్ జంక్షన్లలో పనులు ప్రారంభమయ్యాయి. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని... అప్పటి వరకు పనులు పూర్తి చేసి, ఆ రోజున ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక్కో జంక్షన్ సుందరీకరణకు దాదాపు రూ.25 లక్షల చొప్పున ఖర్చు కానుందని అంచనా. ఆయా జంక్షన్లలో స్థానిక అంశాలను ప్రతిబింబించే త్రీడీ చిత్రాల బొమ్మలు ఏర్పాటు చేయనున్నారు. జంక్షన్లు ఇవీ... సుచిత్ర స్క్వేర్, మెట్టుగూడ, ఎల్బీనగర్ లక్డీకాపూల్, ఆరాంఘర్, ఉప్పల్ మూసాపేట్, బుద్ధ భవన్ -
31 డేస్... 34 రోడ్స్
సిటీలో ట్రాఫిక్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటే జంక్షన్లు, రహదారుల విస్తరణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో గుర్తించిన ప్రాంతాల్లో ఈ పనులు వేగవంతంగా చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే 31 రోజుల్లో 34 మార్గాల్లో రహదారి విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి పనులకు అవసరమైన భూ/ఆస్తుల సేకరణ పూర్తి కావాలని లక్ష్యం విధించింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసిన అధికారులకు నజరానా సైతం ఇస్తామని ప్రకటించింది. ప్రతి మూడు నెలలకు 35 మార్గాల్లో పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. తొలి విడతగా ఉప్పల్–నల్లచెరువు, ఎల్బీ నగర్ జంక్షన్ తదితర ప్రాంతాలు విస్తరణకు నోచుకోనున్నాయి. ఇదే జరిగితే ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాఫీగా సాగుతాయి. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. సాక్షి, సిటీబ్యూరో: 31 రోజులు.. 34 మార్గాలు.. జంక్షన్లు, రహదారుల విస్తరణకు అవసరమైన భూ/ఆస్తుల సేకరణను త్వరితంగా పూర్తిచేసేందుకు ఇదీ జీహెచ్ఎంసీ లక్ష్యం. నగరంలోని అనేక మార్గాల్లో రహదారులు ఇరుకై, బాటిల్‌నెక్స్‌తో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తరచూ ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్ఓబీల పనులకు ప్రణాళికలు రూపొందించినప్పటికీ, ఏళ్ల తరబడి పనులు ముందుకు సాగడం లేవు. దీనికి ప్రధాన అవరోధం ఆయా మార్గాలు, జంక్షన్ల విస్తరణకు అవసరమైన ఆస్తుల సేకరణ. ఎంతో కాలంగా ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదు. ఆయా ప్రాంతాల్లోని ఆస్తుల యజమానుల్ని సంప్రదింపుల ద్వారా ఒప్పించలేకపోతున్నారు. మొండికేసిన వారి విషయంలో భూసేకరణ చట్టం మేరకు సేకరించాల్సి ఉంది. విస్తరణ పనులు జరగాలంటే తొలుత ఆస్తుల సేకరణ పూర్తికావాలి కనుక టౌన్‌ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా, ఒక్కో మార్గానికి ఒక్కో ఏసీపీ, ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లతో ఈ కమిటీలు నియమించారు. తమకప్పగించిన 34 మార్గాల్లో ఆస్తుల సేకరణను డిసెంబర్‌లోగా వారు పూర్తిచేయాలి. అలా లక్ష్యాన్ని సాధించిన వారికి ప్రశంసాపత్రాలతోపాటు ప్రత్యేక నజరానాలు ఇవ్వనున్నారు. ఎస్సార్డీపీ,హెచ్ఆర్డీసీ పనులకు కూడా .. రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి వివిధ పథకాల కింద పనులు చేస్తుండటంతో కొన్ని ఎస్సార్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం), కొన్ని హెచ్ఆర్డీసీ(హైదరాబాద్ రోడ్డెవలప్మెంట్ కార్పొరేషన్)ల ద్వారా చేపట్టారు. ఆస్తుల సేకరణ పూర్తికానందున ఈ పథకాల్లోని పనులూ ముందుకు సాగడం లేవు. ఈ పథకాల కింద చేయాల్సిన పనులకు, ఈ పథకాల పరిధిలోలేని వాటికి కూడా టౌన్‌ప్లానింగ్ టీమ్‌లు ఆస్తుల సేకరణ పూర్తి చేయాలి. టౌన్‌ప్లానింగ్ ఏసీపీలకు సహాయంగా కొత్తగా ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న ఏఈల సేవల్ని కూడా వినియోగించుకోనున్నట్లు చీఫ్ సిటీప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి తెలిపారు. సేకకరించాల్సిన ఆస్తులు వేల సంఖ్యలో ఉండటంతో దశలవారీగా ఆస్తుల్ని సేకరించనున్నటు చెప్పారు. తొలి దశలో డిసెంబర్ నెలాఖరులోగా 34 మార్గాల్లో, ఆ తర్వాత ప్రతి మూడుమాసాలకు దాదాపు 35 మార్గాల్లో భూసేకరణ పూర్తిచేయాలనేది లక్ష్యం. మాస్టర్ ప్లాన్ ప్రకారం దాదాపు 150 మార్గాలను విస్తరించాల్సి ఉండటంతో ఆ పనులు చేసేందుకు ఈ లక్ష్యంతో పనులు చేయనున్నారు. భూ/ ఆస్తుల సేకరణ పూర్తికాగానే పనులు పూర్తిచేయనున్నారు. తొలి దశలో.. డిసెంబర్ నెలాఖరులోగా ఆస్తులు సేకరించాల్సిన మార్గాలు ఇవీ... చర్లపల్లి ఆర్ఓబీ (34 ఆస్తులు), ఉప్పల్ జంక్షన్– నల్లచెరువు(168), ఎల్బీనగర్ జంక్షన్ (54), బైరామల్‌గూడ జంక్షన్( 57), కామినేని జంక్షన్(57), కొత్తపేట – నాగోల్ ( 216), సైదాబాద్ రోడ్( 51), రక్షాపురం– హబీబ్‌నగర్(49), బాలాపూర్ జంక్షన్– డీఆర్డీఎల్ వయా హఫీజ్‌బాబానగర్ (124), బండ్లగూడ జంక్షన్– ఎర్రకుంట జంక్షన్(125), హిమ్మత్‌పురా – ఫతేదర్వాజ(138), హుస్సేనీ అలం– దూద్‌బౌలి(172), బహదూర్‌పురా(45),గుడిమల్కాపూర్ జంక్షన్ –లక్ష్మీనగర్(26), ఏక్‌మినార్ మజిద్ – బజార్‌ఘాట్ జంక్షన్(57), గోల్నాక – అంబర్‌పేట (281) శాస్త్రిపురం రైల్వేగేట్ ఆర్ఓబీ, జారాహిల్స్ రోడ్ నెం.13, (45), బోరబండ పంకా బస్టాప్– హైటెక్ హోటల్, నారాయణమ్మ కాలేజీ– గచ్చిబౌలి, ఖాజాగూడ జంక్షన్ – ఓఆర్ఆర్, గచ్చిబౌలి జంక్షన్ – కొత్తగూడ, బొటానికల్ గార్డెన్– ఓల్డ్ బాంబే రోడ్, గచ్చిబౌలి జంక్షన్– ఓఆర్ఓర్ (ఫ్రీలెఫ్ట్), మాదాపూర్ మెగాహిల్స్ లింక్‌రోడ్, మూసాపేట క్రాస్‌రోడ్స్– కైతలాపూర్, బాలానగర్ రోడ్ – నర్సాపూర్ క్రాస్‌రోడ్స్ ఫ్లై ఓవర్, బాలానగర్ క్రాస్‌రోడ్స్– రేడియల్ రోడ్, అంబేద్కర్ జంక్షన్ – సుచిత్ర జంక్షన్, ఆనంద్‌బాగ్ ఆర్యూబీ–జడ్‌టీసీ రోడ్, లాలాపేట్ ఫ్లై ఓవర్–మౌలాలి ఫ్లై ఓవర్, బోట్స్‌క్లబ్– కవాడిగూడ మార్గాలున్నాయి. నోడల్ ఆఫీసర్ ప్రతిరోజూ పనుల్ని పర్యవేక్షిస్తూ ప్రతి మంగళవారం చీఫ్‌సిటీప్లానర్‌కు పనుల పురోగతిపై నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఇటీవల జీఈఎస్‌ను పురస్కరించుకొని కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.45 కోట్లతో ఎన్నో మార్గాల్లో రహదారుల్ని తీర్చిదిద్దడంతో కేవలం హైటెక్ ప్రాంతాల ప్రజలకే సదుపాయాలు కల్పిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో ఇతర ప్రాంతాల్లోనూ పనులకు సిద్ధమయ్యారు. -
ఫ్రీ జంక్షన్స్..ఫ్రీ టర్న్
గోల్కొండ క్రాస్‌రోడ్డు నుంచి సచివాలయానికి వెళ్లేందుకు కిశోర్ వాహనంపై బయలుదేరగా యూటర్న్ చాలా దూరంలో కన్పించగా...రూట్ మార్చాడు. గాంధీనగర్ నుంచి వెళ్లి అశోక్‌నగర్, ఇందిరాపార్కు మీదుగా సచివాలయం వెళ్లాలనుకున్నాడు. కానీ అశోక్‌నగర్ జంక్షన్ దాటడానికి అతడికి 15 నిమిషాలు పట్టింది. ఇలా గమ్యం చేరేలోగా పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్‌లతో దాదాపు 45 నిమిషాల సమయం వృథా అయింది. ♦ నగర జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యల కారణంగా తలెత్తు్తతున్న ఇబ్బందులకు ఇదో ఉదాహరణ. ఇలాంటి వాటిని అధిగమించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు సమస్యాత్మకంగా ఉన్న 100 జంక్షన్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. తొలుత 34 జంక్షన్లలో విస్తరణ పనులు ప్రారంభించనుంది. ఇందుకు రూ.109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యల కారణంగా వాహనాలు సాఫీగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు జంక్షన్ల విస్తరణ..అభివృదిపనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. నగరవ్యాప్తంగా దాదాపు 250 జంక్షన్లుండగా, వాటిల్లో 100 చోట్ల అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించింది. అర్బన్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (యూజేఐపీ)లో భాగంగా ఈ జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చాలా ప్రాంతాల్లో భూసేకరణ జరపాల్సి ఉండటంతో అందుకు ఎంతో సమయం పట్టనుంది. దీంతో భూసేకరణ సమస్యలు లేని ప్రాంతాల్లో తొలిదశలో జంక్షన్ల అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధమైంది. అలాంటి 34 జంక్షన్లను గుర్తించారు. ఇప్పటి వరకు ఐదు ప్రాంతాల్లో మాత్రం పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాలకు సంబంధించి అంచనాలు, అనుమతుల మంజూరు వంటి దశల్లో ఉన్నాయి. మలిదశలో భూసేకరణ సమస్యలు తక్కువగా ఉన్న 30 జంక్షన్లలో, మిగతావాటిని ఆతర్వాతి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలిదశలో చేపట్టనున్న పనులకు రూ.109 కోట్లు ఖర్చుకాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. జీహెచ్ఎంసీ బడ్జెట్ పరిస్థితి దయనీయంగా ఉండటంతో రూ.100 కోట్లు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ)నుంచి రుణంగా తీసుకోవాల్సిందిగా మునిసిపల్ మంత్రి కేటీఆర్ సూచించడంతో అధికారులు అందుకు సిద్ధమయ్యారు. జంక్షన్ల అభివృద్ధి ఇలా.. ⇒ ప్రధానంగా జంక్షన్చుట్టూ వంద మీటర్లకు తగ్గకుండా రోడ్లను వెడల్పు చేస్తారు. ⇒ ట్రాఫిక్ సాఫీగా సాగేలా నేరుగా వెళ్లే రోడ్డుతోపాటు కుడి, ఎడమవైపులకు వెళ్లే రోడ్లను కూడా విస్తరిస్తారు. ⇒ పాదచారులకు ప్రాధాన్యతనిస్తూ జంక్షన్ల వద్ద ఫుట్‌పాత్‌లు, రెయిలింగ్స్ ఏర్పాటుచేసి, నిర్దేశిత ప్రాంతంలోనే రోడ్డు దాటే ఏర్పాటు చేస్తారు. ⇒ జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించేలా సైనేజీలతోపాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ⇒ రెడ్‌సిగ్నల్ పడినప్పుడు పాదచారులు రోడ్డు దాటుతారు కాబట్టి, అప్పటి వరకు వారు వేచి ఉండేందుకు సదుపాయంగా తగిన ప్లాట్‌ఫామ్స్ కూడా నిర్మిస్తారు. తొలిదశలో అభివృద్ధిచేయనున్న జంక్షన్లు.. 1.సుచిత్ర 2. ఐడీపీఎల్ 3.సిటీకాలేజ్ 4.అశోక్‌నగర్ 5.సైబర్‌సిటీ(ఖానామెట్) 6. ప్యారడైజ్ 7. హిమ్మత్‌పురా(శాలిబండ) 8.పురానాపూల్ 9.ఎన్ఎఫ్సీ 10.హైదర్‌గూడ(అత్తాపూర్) 11. కర్మన్‌ఘాట్ 12. బీఎన్ రెడ్డి 13. షెనాయ్ నర్సింగ్‌హోమ్ 14. ఐఐఐటీ 15. నిజాం కాలేజ్ 16. వీఎస్టీ 17. ఆజామాబాద్ 18. హస్తినాపురం 19. కవాడిగూడ 20. ఫీవర్ హాస్పిటల్ 21. రాణిగంజ్ 22. ఎతెబార్ చౌక్ 23. బీబీ బజార్ 24. అలీ కేఫ్ 25. బోరబండ బస్టాప్ 26. శివాజీ బ్రిడ్జి(దారుల్షాఫా) 27. మదీన 28. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ 29. రోడ్ నెంబర్ 6(అంబర్‌పేట) 30. బాలాజీనగర్ 31. రామంతాపూర్ చర్చి టి 32. నర్సాపూర్ 33. వీటీ కమాన్ 34. జోహ్రాబీ దర్గా. నగరంలో మూడు రోడ్ల జంక్షన్ల నుంచి 12 మార్గాల నుంచి వచ్చి కలిసే జంక్షన్లు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా.... ⇒ నాలుగు కంటే ఎక్కువ రోడ్లు వచ్చి కలిసేవి ⇒ నాలుగు రోడ్ల జంక్షన్లు (చౌరస్తాలు) ⇒ మూడు రోడ్ల టీ జంక్షన్లు ⇒ మూడు రోడ్ల వై జంక్షన్లు ఈ జంక్షన్లలో వాహనదారులు ముందుకు కదిలేందుకు ఎంతో సమయం పడుతోంది. వీటిల్లో కొన్నింటికి ఇటీవల సిగ్నళ్లు లేకుండా కొంత దూరం ముందుకు తీసుకెళ్లి యూటర్న్ ఇచ్చినప్పటికీ సమస్య తగ్గకపోగా కొన్ని చోట్ల మరింత తీవ్రంగా మారింది. తార్నాక, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో యూటర్న్ సిస్టం ఫెయిలైంది. -
జంక్షన్లపై ఆంక్షలు
హైదరాబాద్ : రాజధాని నగరంలో ప్రధాన రోడ్లు జంక్షన్ల వద్ద భారీ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారీగా జన సమీకరణకు కారణమయ్యే మల్టిప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, పెట్రోల్ బంకులను ప్రధాన జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో నిర్మించవద్దని ఆంక్షలు విధించింది. నగరంలో జంక్షన్ల వద్ద కొత్త భవనాలకు అనుమతులను నిషేధిస్తూ ప్రత్యేక నిబంధనలను జారీ చేయాలని జీహెచ్ఎంసీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుందని తెలిసింది. జంక్షన్ల జామ్‌పై ఆందోళన... నగరంలో నిత్య నరకంగా మారిన ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు స్ట్రేటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎస్ఆర్డీపీ) కింద రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులను చేపట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా ఎడమ వైపు(ఫ్రీ లెఫ్ట్) మలుపు తిరిగే అవకాశాన్ని కల్పించేందుకు ... ప్రధాన జంక్షన్ల వద్ద జీహెచ్ఎంసీ అదనపు లేన్‌ను నిర్మిస్తుంది. ఇందుకోసం రోడ్లకు ఇరువైపులా భూములను సేకరిస్తోంది. అయితే ఇప్పటికే ఇరుకుగా మారిన జంక్షన్లకు సమీపంలో భారీ భవనాల నిర్మాణాలు జరుగుతుండడం పట్ల జీహెచ్ఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి భవనాలకు అనుమతులు జారీపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి నివేదించింది. దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో అమలు చేస్తున్న భవన నిబంధనలతో పాటు ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) నియమావళిపై అధ్యయనం చేసిన జీహెచ్ఎంసీ... ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్టేషన్ కన్సల్టెంట్లతో సంప్రదింపులు జరిపి జంక్షన్ల వద్ద నిర్మాణాలపై అనుసరించాల్సిన ముసాయిదా నిబంధనలను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించింది. ఈ నిబంధనలను అమలు చేస్తే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు కొంత మేరకు పరిష్కారం అవుతాయని జీహెచ్ఎంసీ అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని ఇతర ముఖ్య నగరాలు, పట్టణాల్లో సైతం ఈ నిబంధనలను వర్తింపజేస్తే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. జంక్షన్ల వద్ద ఆంక్షలు ఇలా ఉండనున్నాయి... - జంక్షన్లకు 300 మీటర్ల వ్యవధిలో జనం గూమికూడడానికి కారణమయ్యే మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాల్స్, స్కూల్స్, పెట్రోల్ బంక్‌లపై నిషేధం. - జంక్షన్ల స్ల్పే పోర్షన్ పరిధిలో భవనాల ప్రవేశం, నిష్ర్కమణ ద్వారాలు ఉండరాదు. - జంక్షన్ల స్ల్పే పోర్షన్‌కు చుట్టూ రెయిలింగ్‌తో రక్షణ కల్పించాలి. - ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కోసం జంక్షన్ల వద్ద అదనపు లేన్‌ను నిర్మించాలి. - రోడ్డు వైశాల్యం ఆధారంగా 15-25 మీటర్ల వ్యాసార్థంలో స్ల్పేను విడిచి పెట్టాలి. - జంక్షన్లకు 300 మీటర్ల పరిధి వరకు వాహనాలను పార్కింగ్ చేయరాదు. - జంక్షన్లకు 100 మీటర్ల పరిధిలోపు అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్‌లపై నిషేధం.