‘హోదా’ ఇచ్చే చాన్సే లేదు: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటుకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించకున్నా విభజన లో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దుతామన్నారు. తమ చిత్తశుద్ధిని శంకిం చాల్సిన పనిలేదని, రాష్ట్రాభివృద్ధికోసం ఎన్ని విమర్శలైనా భరిస్తానన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ‘హోదా’వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలొచ్చే అవకాశమున్నా అదే సర్వస్వం కాదన్నారు. హోదాపై తనను విమర్శిస్తున్న వారిని రాష్ట్ర విభజనప్పుడు ఏమి చేశారంటూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ ఒక్కరే సమైక్యాంధ్రకోసం తుదికంటా కట్టుబడి ఉన్నారన్నారు.
కేంద్రం నిరంతర చేయూత లేకుండా రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వలేకపోతున్నందున రాష్ట్ర అభివృద్ధికి విదేశీ రుణం తీసుకొచ్చి ఇస్తామని, ఆ అప్పును కేంద్రం తీరుస్తుందన్నారు. కేంద్రం మామూలుగా రాష్ట్రాలకిచ్చే నిధులకిది అదనమన్నారు. ‘పోలవరం’ను కేంద్రమే నిర్మిస్తుందన్నారు. 14వ ఆర్థికసంఘం తేల్చిన రూ.22వేల కోట్లకుపైగా లోటును కేంద్రం భర్తీ చేస్తుందన్నారు. ప్రత్యేక దృష్టి, ప్రత్యేకసాయం, ప్రత్యేకశ్రద్ధతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తామన్నారు. రాష్ట్రానికివ్వాల్సిన వాటిల్లో మిగి లింది గిరిజన వర్సిటీయేనన్నారు. మొత్తంగా రూ.2.25 లక్షల కోట్లు రాష్ట్రానికొస్తాయన్నారు. అమరావతిని ఆకర్షణీయ నగరాల జాబితాలో చేరుస్తామన్నారు.
డబ్బు ఎప్పుడూ పాచిపోలేదు..
ఈ దేశంలో డబ్బు ఎప్పుడూ పాచిపోలేదని సినీనటుడు పవన్‌కల్యాణ్‌నుద్దేశించి వెంకయ్యనాయుడు అన్నారు. తనవి, ప్రధానమంత్రివి దిష్టిబొమ్మలు దహనం చేయడాన్ని ఆక్షేపించారు.