సానియా ఆవాసంపై రాని స్పష్టత | No clarity on Sania mother murder case | Sakshi
Sakshi News home page

సానియా ఆవాసంపై రాని స్పష్టత

Published Tue, Jul 12 2016 3:13 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

సానియా ఆవాసంపై రాని స్పష్టత

సానియా ఆవాసంపై రాని స్పష్టత

 తనకు అప్పగించాలన్న నానమ్మ పిటిషన్ తిరస్కరించిన కోర్టు
 హైదరాబాద్: అమ్మ సింథియా దూరమైపోయింది.. అమ్మను చంపినందుకు నాన్న రూపేశ్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.. వీరిద్దరితో ఇన్నాళ్లూ ఎంతో ఆనందంగా గడిపిన కూతురు సానియా పరిస్థితి ఇప్పుడు సంకటంలో పడింది. నాన్నమ్మ లలిత సాని యాను తనకే ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థిస్తున్నా అది ఇంకా కొలిక్కి రాలేదు. సానియాను తనకు అప్పగించాలంటూ లలిత.. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి 8వ మెట్రోపాలిటన్ కోర్టులో సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

ఈ అంశాన్ని ఫ్యామిలీ కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు సానియాను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కేర్ సెంటర్‌కు తరలించాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైదర్షాకోట్‌లోని కస్తూర్భా రెస్క్యూ హోమ్‌లో ఉన్న సానియాను సోమవారం సాయంత్రం సైదాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కేర్ సెంటర్‌కు అధికారులు తరలించారు.
 
 అమ్మా, నాన్నలా చూసుకుంటా: లలిత
 సానియా నాన్నమ్మ లలితతో పాటు ఆమె బంధువులు, కాంగో దేశ రాయబారి, న్యాయవాదులు సోమవారం కోర్టుకు వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోర్టు ప్రాంగణంలోనే వేచి ఉన్నారు. ఈ సందర్భంగా సానియా నాన్నమ్మ లలిత విలేకరులతో మాట్లాడుతూ.. సాని యాను తనకే అప్పగించాలని, తాను హైదరాబాద్‌లో ఉండి ఆమెను పెంచి విద్యాబుద్దులు చెప్పిస్తానన్నారు. ఇతర మనుమలు, మనవరాళ్లతో సమానంగా సానియాను ఏ లోటూ లేకుండా చూస్తానని, అమ్మా, నాన్నలా చూసుకుంటానని చెప్పారు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలులో ఉండడంతో కోర్టు దయతలచి సానియాను తనకు అప్పగించాలని వేడుకున్నారు.
 
 సానియాకు డీఎన్‌ఏ పరీక్షలపై నేడు విచారణ..
 అసలు చనిపోయింది సింథియానా? కాదా? అనేది రూఢీ చేసుకునేందుకు సానియాకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని ఉప్పర్‌పల్లి 8వ మెట్రోపాలిటన్ కోర్టులో సోమవారం కూకట్ పల్లి సీసీఎస్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇది మంగళవారం విచారణకు రానుంది. మరోవైపు నిందితుడు రూపేశ్‌ను లోతుగా విచారించాల్సిన అవసరం ఉన్నందున అతడిని మరో మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా మంగళవారం విచారణకు రానుంది.

Advertisement
Advertisement