
పన్ను చెల్లింపు డిమాండ్ కోసం చర్యలేవీ వద్దు
సేవాపన్ను ప్రిన్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) 2010–2014 వరకు నిర్వహించిన వ్యాపార కార్యకలాపాలకు రూ.2వేల కోట్ల వరకు సేవా పన్ను చెల్లించాలంటూ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు కోసం చర్యలేవీ తీసుకో వద్దని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం సేవాపన్ను ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రిన్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2010–14 మధ్య నిర్వహించిన వ్యాపార కార్యకలాపాలకు అన్ని పన్నులు, జరిమానాలు కలిపి రూ.2వేల కోట్ల వరకు సేవా పన్ను కింద చెల్లించాలంటూ గతేడాది నవంబర్‌లో సేవా పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ఏజీ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఈ ప్రొసీడింగ్స్ జారీచేసే పరిధి ప్రిన్సిపల్ కమిషనర్‌కు లేదన్నారు. తాము అంత పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.