- తొలుత మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని యోచన
- తెలంగాణ ప్రభుత్వం నుంచి రాని అనుమతులు
- వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ఏర్పాటుకే మొగ్గు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో త్వరలో వృత్తి విద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇక్కడ తొలుత మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే తగినంత స్థలంతోపాటు క్రీడామైదానం లేకపోవడంతో అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ వర్గాల సమాచారం.
ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున గోకుల్ పేరుతో ఉన్న ఓ డిగ్రీ కళాశాలను కొనుగోలు చేశారు. ఆ కళాశాలను ప్రస్తుతమున్న చిరునామా నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోకి మార్చడంతోపాటు కొత్త కోర్సులు ప్రారంభించేందుకు అనుమతివ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి దరఖాస్తు చేశారు. ఇదే విషయమై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ దరఖాస్తు చేసింది. అయితే వారినుంచి ఇప్పటివరకూ ఎలాంటి అనుమతులు రాలేదు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా ట్రస్ట్ వర్గాలు నిర్ణయించాయి.
బాబు సీఎంగా ఉన్నప్పుడే అనుమతులు
ఎన్టీఆర్ ట్రస్ట్కు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగా ఉన్న స్థలం కావాలని అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి లాల్జాన్ బాషా ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే ముఖ్యమంత్రి కావడంతో ఆగమేఘాల మీద స్థలం లీజుకు కేటాయించారు. అనుమతులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆ స్థలంలో రెండు భవనాలున్నాయి. ఒక భవనంలో టీడీపీ కేంద్ర, ఏపీ, తెలంగాణ రాష్ర్ట కార్యాలయాలు కొనసాగుతున్నాయి. పార్టీ కార్యాలయానికి అనుబంధంగా మెస్, గ్రంథాలయం, సమాచార కేంద్రం, డార్మిటరీలతోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం రెండో భవనంలో నడుస్తున్నాయి. టీడీపీ కేంద్ర, ఏపీ కార్యాలయాలు, అనుబంధంగా ఉన్న గ్రంథాలయం, సమాచార కేంద్రం, కార్యక్రమాల కమిటీ తదితరాలు గుంటూరు తరలిపోవడంతో భవనం దాదాపు ఖాళీ అయ్యింది.
దీంతో అక్కడ కళాశాల ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నారాయణ విద్యాసంస్థల పర్యవేక్షణలో గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీ నిర్మిస్తున్నారు. దానికి కొనసాగింపుగానే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని భావించారు. అనుమతి రాకపోవడంతో ప్రస్తుతం ఆ ఆలోచనకు బ్రేక్ పడింది. వృత్తి విద్యా శిక్షణ కేంద్రం తెరపైకి వచ్చింది. ట్రస్ట్ కోసం తీసుకున్న స్థలంలో సేవా కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి. వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఎవరికీ దీర్ఘకాలం అద్దెకు ఇవ్వకూడదు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వృత్తి విద్యా శిక్షణ కేంద్రం!
Published Sun, May 15 2016 5:05 AM | Last Updated on Sat, Aug 11 2018 4:32 PM
Advertisement
Advertisement