=కాగితాల్లోనే 115 కమ్యూనిటీ హాళ్లు
=పైసలున్నా.. పనులు కావు
=ఆశించిన కమీషన్లు లేక పట్టించుకోని కార్పొరేటర్లు
=పేదబస్తీలపై నిర్లక్ష్యం
=కబ్జా చెరలో పాతహాళ్లు
సాక్షి, సిటీబ్యూరో : పేదల బస్తీల్లో పుట్టినరోజులు, తదితర చిన్నచిన్న వేడుకలు, చిన్నచిన్న సంఘాల సమావేశాలు జరుపుకోవాలంటే కమ్యూనిటీ హాళ్లే ఆధారం. ఫంక్షన్‌హాళ్ల ఖర్చులు భరించలేని పేదలు పెళ్లిళ్లకు సైతం వీటినే వినియోగిస్తున్నారు. నగరంలోని దాదాపు 1500 బస్తీల్లోని ప్రజలు వేడుకలకు అవసరమైన కమ్యూనిటీ హాళ్లు లేక అల్లాడుతున్నారు. గతంలో ఉన్న ఎంసీహెచ్ కమ్యూనిటీ హాళ్లు కబ్జాల పరమయ్యాయి.
చోటామోటా నేతలు వాటిని తమ సొంత ఆస్తుల్లో కలిపేసుకోవడంతో చిన్నాచితకా ప్రజలు వేడుకలు జరుపుకోవాలంటే కుదరడం లేదు. పేదల అవసరాన్ని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు తమ కార్పొరేటర్ల ఫండ్ నుంచి భారీగానే నిధులను మంజూరు చేయించారు. కానీ.. ఆశించిన కమీషన్లు రాకపోవడంతో వాటి గురించి పట్టించుకోవడం లేదు. దాంతో, కమ్యూనిటీహాళ్ల పనులు ముందుకు కదలడం లేదు.
కొందరు కాంట్రాక్టర్లే ఎక్కువ పనులు దక్కించుకుంటూ.. తగిన న్ని వనరులు లేక వాటి నిర్మాణాలు పూర్తి చేయడం లేదు. ఇంకొందరు టెండరులో తక్కువ లెస్‌తో పనులు దక్కించుకున్నప్పటికీ.. అనంతరం గిట్టుబాటు కావడం లేదని చేతులెత్తేస్తున్నారు. ప్రతి పనిలోనూ కార్పొరేటర్లు, అధికారులకు ముడుపులు చెల్లించాల్సి రావడం.. వీటి నిర్మాణాలతో తమకు పెద్దగా ఆదాయం లేకపోవడంతో వారికి ముడుపులు చెల్లించలేక పనులు వదులుకుంటున్నవారు ఇంకొందరు.
ఈ నేపథ్యంలో, కాంట్రాక్టులు పొందినవారు నిర్మాణాలు ప్రారంభించి కొద్దిరోజులకే వాటిని వదిలివేయడం.. ఇంకొందరు అసలు పనులే చేపట్టకపోవడం వంటి కారణాలతో కమ్యూనిటీ హాళ్లు కాగితాలను దాటడం లేదు. నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ చర్యలు తీసుకోవడం లేదు. కార్పొరేటర్లు సైతం రోడ్డు పనులు.. పారిశుధ్య పనులు, డీసిల్టింగ్ వంటి వాటిల్లో వచ్చే కమీషన్లు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల్లో రాకపోవడంతో వాటిని పట్టించుకోవడం లేదు.
52 డివిజన్లలో మంజూరైన కమ్యూనిటీ హాళ్లు : 117
నిర్మాణ పనులు ప్రారంభించినవి : 2
కేటాయించిన మొత్తం నిధులు : 8.80 కోట్లు
వ్యయం చేసినవి : 7.15 లక్షలు
కాగితాల్లోనే 115 కమ్యూనిటీ హాళ్లు
Published Sun, Dec 1 2013 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:08 AM
Advertisement
Advertisement