హెచ్‌సీయూ అష్టదిగ్బంధం | Occulsion of Kanhaya Conway | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూ అష్టదిగ్బంధం

Published Thu, Mar 24 2016 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

హెచ్‌సీయూ అష్టదిగ్బంధం

హెచ్‌సీయూ అష్టదిగ్బంధం

కన్హయ్య కాన్వాయ్ అడ్డగింత.. వర్సిటీ గేట్లన్నీ బంద్.. ఆంక్షలు..
 
 హైదరాబాద్: విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని బుధవారం పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. పరిపాలనా భవనం, ప్రధాన గేటు షాపింగ్ కాంప్లెక్స్ తదితర అన్నిచోట్లా భారీగా మోహరించారు. మెస్‌లు, ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. వర్సిటీకి నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌ను ప్రధాన గేటు వద్దే అడ్డగించారు. దాంతో ఆయన గేటు వద్దే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుకుపడ్డారు.

కొద్దిరోజులుగా జరుగుతున్న వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు మళ్లీ ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించిన పాలకవర్గం వర్సిటీని బుధవారం పోలీసుల చేతికి అప్పగించింది. ‘‘ప్రధాన ద్వారం మినహా అన్ని గేట్లు మూసేస్తున్నాం. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులను మినహా మీడియా, రాజకీయ నాయకులు, వేరే వర్సిటీల విద్యార్థి సంఘాల నేతలెవరినీ అనుమతించబోం’’ అని పేర్కొంటూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ మంగళవారమే సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఇందుకవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దాంతో పోలీసులు మంగళవారం రాత్రి నుంచే వర్సిటీలో అడుగడుగునా మోహరించారు.

వర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావు ఆదేశాల మేరకు ఉదయం నుంచి ప్రధాన ద్వారం సహా అన్ని గేట్లనూ మూసివేయించారు. ఐడీ కార్డులు చూపిన విద్యార్థులను, వర్సిటీ సిబ్బందిని మినహా ఎవరినీ లోనికి అనుమతించలేదు. కవరేజీకివెళ్లిన మీడియాను సైతం గేటు బయటే అడ్డుకున్నారు. వర్సిటీల్లో పోలీసులకేం పనంటూ విద్యార్థులు వారితో వాగ్వాదానికి దిగారు. విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ వర్సిటీ బంద్‌కు హెచ్‌సీయూ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నిరసనకు దిగారు. కేంద్రానికి, వీసీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రోహిత్ మృతికి కారణమైన వీసీని అరెస్టు చేయక పోగా  ఆయనకే మళ్లీ వర్సిటీ పగ్గాలు అప్పగిస్తారా అని ప్రశ్నించారు. ఆయన్ను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు.

 బోధనేతర సిబ్బంది సహాయ నిరాకరణ
 మరోవైపు, వీసీ చాంబర్‌ను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ బోధనేతర సిబ్బంది సహాయ నిరాకణ చేశారు. మెస్‌లు మూసేసి వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట మూడు గంటలపాటు ధర్నాకు దిగారు. ధర్నాకు ఏబీవీపీ మద్దతు పలికింది. దాడికి పాల్పడ్డ విద్యార్థులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మెస్‌లు బంద్ చేయడంతో వంట చే సుకునేందుకు రోడ్డుపై పొయ్యి పెట్టేందుకు విద్యార్థి జేఏసీ నేతలు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి నాయకులు తమ మాట వినకపోవడంతో లాఠీలకు పని చెప్పి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి ఎనిమిదింటికి విద్యార్థులు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద వంటావార్పు నిర్వహించి అక్కడే భోంచేశారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వర్సిటీకి నాలుగు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్టు రిజిస్ట్రార్ సర్క్యూలర్ జారీ చేశారు. సోమవారం నుంచి యథావిధిగా తరగతులుంటాయన్నారు. ఆందోళనలను అడ్డుకునేందుకు వీసీయే ఈ చర్యకు దిగారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 హెచ్‌సీయూ గేటు వద్ద రోహిత్ తల్లి బైఠాయింపు
 హైకోర్టు సీజేను కలిసేందుకూ యత్నం

 హైదరాబాద్: హెచ్‌సీయూలోకి వ్రేశించేందుకు బుధవారం రాత్రి ప్రధాన ద్వారం వద్దకు వచ్చిన రోహిత్ వేముల తల్లి రాధికను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా ఆమె అక్కడే కుమారుడు రాజాతో కలిసి కాసేపు బైఠాయించారు. రాధికకు మద్దతుగా విద్యార్థులు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. వీసీ అప్పారావుకు తన కడుపు కోత తెలియదని ఈ సందర్భంగా ఆమె విమర్శించారు. ‘‘నా కొడుకు చనిపోయినప్పుడు కనిపించని వందలాది మంది పోలీసులు వీసీ ఆఫీసుపై విద్యార్థులు దాడి చేశారన్న నెపంతో మోహరించడం దారుణం. విద్యార్థుల పోరాటానికి నా మద్దతుంటుంది.

రోహిత్ చట్టం వచ్చేదాకా విద్యార్థులతో కలిసి పోరాడతా’’ అని స్పష్టం చేశారు. అంతకుముందు, హెచ్‌సీయూలో విద్యార్థుల హక్కులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ, పోలీసు శాఖల తీరును నియంత్రించాలంటూ పౌర హక్కుల సంఘం నేతలతో కలిసి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేను బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసేందుకు రాధిక ప్రయత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కాసేపటికి సీజే నివాసంలోని హైకోర్టు రిజిస్ట్రార్‌ను కలిసేందుకు అనుమతించారు. హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి విద్యార్థుల హక్కులను కాపాడాలని ఆమె కోరగా... సమయం మించిపోయిందని, గురువారం విచారిస్తారని రిజిస్ట్రార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement