అడుగుపెడితే.. అరెస్టే! | Officials of IT Cell working out the location | Sakshi
Sakshi News home page

అడుగుపెడితే.. అరెస్టే!

Published Thu, Jul 28 2016 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

అడుగుపెడితే.. అరెస్టే! - Sakshi

అడుగుపెడితే.. అరెస్టే!

- ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంకు ఆధునిక హంగులు
- ‘పొరుగు రాష్ట్రాల’ నేరగాళ్ల ఫొటోలూ నిక్షిప్తం
- సిటీలో ‘వలస దుండగుల’ బెడద తగ్గించేందుకే
- కసరత్తు చేస్తున్న నగర ఐటీ సెల్ అధికారులు
 
 దృష్టి మళ్ళించి దోపిడీలు చేయడంలో బివాండీ ముఠా దిట్ట. ఈ ముఠాను ఇటీవలే నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా చెన్నై, ముంబై, అజ్మీర్, బెంగళూరు, జల్గాం పోలీసులకూ సుపరిచితమే.. అటు బ్యాంకు ఖాతాదారుల్ని టార్గెట్‌గా చేసుకుని అటెన్షన్ డైవర్షన్‌తో కొల్లగొడుతున్న బిహార్ ముఠా కూడా అబిడ్స్ పోలీసులకు చిక్కింది. వీరిపై అక్కడా కేసులున్నాయి. ఇవే కాదు.. పొరుగు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి కొల్లగొడుతున్న ఘరానా గ్యాంగ్స్ ఎన్నో ఉన్నాయి. వీటికి చెక్  చెప్పడానికి సన్నాహాలు చేస్తున్న నగర పోలీసులు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంకు ఆధునిక హంగులు అద్దుతున్నారు. దీంతో నగరంలో అడుగుపెట్టగానే నేరస్తులను పట్టుకునేలా వ్యూహం రచిస్తున్నారు.    - సాక్షి, హైదరాబాద్
 
  ‘పని’ పూర్తయ్యాకే చిక్కుతున్నారు..
 మహానగరం అనేక రాష్ట్రాలకు చెందిన వలస దొంగలకు విలాస కేంద్రంగా మారుతోంది. ఏపీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన ముఠాలు తరచూ సిటీకి ‘వచ్చి వెళ్తుంటాయి’. వీరంతా పంజా విసిరిన తర్వాతే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిందితుల్ని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఇలాంటి అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే గుర్తించి, కట్టడి చేయగలిగితే నగరవాసికి నష్టం లేకుండా చేయవచ్చు. ఇదే ఆలోచన నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డికి వచ్చింది. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టంలో మార్పులకు నాంది పడింది.
 
  ప్రస్తుతం వినియోగిస్తున్న విధానమిలా..
 నగర పోలీసు విభాగం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను నెక్ సంస్థ నుంచి ఖరీదు చేసింది. దీన్ని ఐటీ సెల్ అధికారులు ఆఫ్‌లైన్ విధానంలో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణాల పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అరెస్టు అయిన నిందితుల ఫొటోల డేటాబేస్‌ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీసుస్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను పంపి, గతంలో ఎక్కడైనా అరెస్టు అయ్యాడా? అనేది తెలపాలని ఐటీ సెల్‌ను కోరుతున్నారు. ఈ ఫొటోను సాఫ్ట్‌వేర్ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్ చేసి అలాంటి వివరాలుంటే గుర్తిస్తున్నారు.
 
  ‘పొరుగు వారి’ వివరాలూ చేరుస్తూ..
 ఈ సిస్టంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నేరగాళ్ల ఫొటోలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో పట్టుబడిన వారి ఫొటోలు, వివరాలను నిక్షిప్తం చేయనున్నారు. ఈ మార్పుల నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో ప్రధాన ప్రాంతాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిపుష్టం చేస్తారు. దీనికోసం ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్‌లైన్‌లో ఉంచి లైవ్ సెర్చ్‌లు చేయడానికి ఐటీ సెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌కు సర్వర్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానిస్తారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచైనా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించే సర్వర్ తక్షణం కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించే ఆటోమేటిక్ నంబర్‌ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టం ట్రాఫిక్ విభాగం ఏర్పాటు చేస్తున్న ఐటీఎంఎస్ ప్రాజెక్టు ద్వారా సమకూరుతుండగా ఫేషియల్ రికగ్నైజేషన్‌ను ప్రభుత్వం అందించే నిధులతో సమీకరించుకుని అభివృద్ధి చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement