జిల్లా ఆస్పత్రులకు ఆన్‌లైన్ గ్రేడింగ్
♦ గ్రేడింగ్‌లను బట్టే నిధులు
♦ నీతి ఆయోగ్ సిఫారసులకు కేంద్రం ఆమోదం
♦ కచ్చితత్వం కోసం స్వచ్ఛంద సంస్థతో తనిఖీ
సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆస్పత్రుల ప్రక్షాళనకు కేంద్ర నడుం బిగించింది. ఈ మేరకు ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ చేసిన సిఫార సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జిల్లా ఆస్పత్రుల పనితీరు, సామర్థ్యాన్ని కొలిచి ర్యాంకింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రేడింగ్‌ను బట్టే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసింది. జిల్లా ఆçస్పత్రుల్లో ఆరోగ్య సేవలను, నాణ్యతను మెరుగు పరచడం, జవాబుదారీతనాన్ని పెంచడమే దీని లక్ష్యమని ప్రకటించింది. ఆస్పత్రులను ‘ర్యాంకింగ్ పోర్టల్’కు అనుసంధానం చేయడం ద్వారా మరిం త పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తాము తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు సమాచారం పంపింది.
రంగుల ఆధారంగా ర్యాంకింగ్...
ఒక్కో రాష్ట్రంలో రెండు సాధారణ పనితీరు, మరో రెండు అత్యంత తక్కువ పనితీరు ప్రదర్శిస్తున్న ఆస్పత్రులను రాష్ట్రాలు ఎంపిక చేయాలి. వీటికి సంబంధించి కేంద్రం కోరిన సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉంచాలి. ఆ ప్రకారం ఆయా ఆçస్ప త్రులకు గ్రేడ్ ఇస్తారు. కచ్చితమైన సమాచారం ఇచ్చారో లేదో తెలు సుకునేందుకు స్వచ్ఛంద సంస్థతో తనిఖీలు చేయించి ఆస్పత్రులకు ర్యాంకింగ్ ఇస్తారు. ర్యాంకింగ్‌లో రంగులను, ఇంగ్లిష్ అక్షరాలను ఉపయోగించారు. పచ్చ (ఎ ర్యాంకింగ్) వస్తే ఆ ఆస్పత్రి పనితీరు మంచిగా ఉందని ధ్రువీకరిస్తారు. పసుపు(బి ర్యాంకింగ్) వస్తే సాధారణ పనితీరున్న ఆస్పత్రిగా పరిగణిస్తారు. గులాబీ(సి) వస్తే తక్కువ పనితీరున్న ఆస్పత్రి గా ధ్రువీకరిస్తారు. ఇక రెడ్ (డి) గ్రేడ్ వస్తే అత్యంత అధ్వాన ఆస్పత్రిగా గుర్తిస్తారు. వైద్య సేవలకూ మార్కులు ఇస్తారు.
ర్యాంకింగ్‌లో ఎంతమంది వచ్చి వైద్య సేవలు ఉపయోగిం చుకున్నారనే దానికి 32.5 శాతం మార్కులు, అందుతున్న వైద్య సేవల కు 30 శాతం మార్కులు, అక్కడ ఎటువంటి ప్రక్రియ ద్వారా సేవలు అందుతున్నాయో దానికి 27.5 శాతం మార్కులు, రోగుల భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యానికి 10 శాతం మార్కులు ఇస్తారు. దీని వల్ల గ్రేడింగ్‌ల కోసం ఆస్పత్రుల మధ్య పోటీ వాతావరణం నెలకొని మెరుగైన వైద్య సేవలు అందుతాయని కేంద్రం ఆశిస్తోంది.