
50 సీట్లపై మజ్లిస్ గురి..!
డివిజన్లలో ఓవైసీ బ్రదర్స్ ప్రచారం
సిటీబ్యూరో: ఇప్పుడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50 డివిజన్లపై మజ్లిస్ పార్టీ గురిపెట్టింది. మొత్తం 150 డివిజన్లకు గాను 60 స్థానాల్లో పోటీకి దిగింది. బరిలో దిగిన డివిజన్లు ఎట్టి పరిస్థితిలోనూ చేజారకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసి 43 స్థానాల్లో విజయం సాధించిన మజ్లిస్ పార్టీ ఈసారి పది డివిజన్లను తగ్గించుకుంది. పట్టులేని చోట పోటీ చేసి ఓడిపోయే కంటే బలమైన స్థానాలు చేజారకుండా చూసుకోవాలని భావిస్తోంది. పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడంతో పాటు సొంత గడ్డపై పార్టీ పూర్వ వైభవం చెక్కుచెదరకూడదని నేతలు నిశ్చయించుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించిన మజ్లిస్ బ్రదర్స్.. అభ్యర్థుల విజయానికి సైతం అదేస్థాయిలో ప్రచారం చేస్తున్నారు.
బ్రదర్స్ సుడిగాలి పర్యటన..
ఎన్నికల అజెండా లేకుండా స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారానికి దిగిన ఒవైసీ బ్రదర్స్ గల్లిగల్లీలో పాదయాత్రలు, రాత్రి బహిరంగ సభలతో సాగుతున్నారు. పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు, పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సుడిగాలి పర్యటనలు చేస్తూ గడప గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తు లేనప్పటికీ వ్యతిరేకత కూడా ప్రదర్శించడం లేదు. బహిరంగ సభల్లో కేవలం కాంగ్రెస్, తెలుగు దేశం- బీజేపీలపై మాత్రమే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఇదీ గత చరిత్ర..
మూడు దశాబ్దాల క్రితం 1986లో జరిగిన ఎన్నికల్లో 100 వార్డులకు గాను 38 స్థానాల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో పూర్తిస్థాయి మెజార్టీ లేకుండా ఐదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించింది. 2002 ఎన్నికల్లో 36 డివిజన్లు, 2009లో 43 స్థానాల్లో విజయం సాధించారు. ఈసారి 60 డివిజన్ల బరిలో దిగి కనీసం 50 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని వ్యూహాత్మకంగా సాగుతున్నారు.