జీహెచ్‌ఎంసీలో ఉద్యోగుల ఆందోళన బుధవారం తీవ్రరూపం దాల్చింది. ప్రధాన ప్రతిపక్ష యూనియన్ బీఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో బంద్ పాటించారు. యూనియన్ ప్రతినిధులు ప్రధాన కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిని బయటకు పంపించి, అన్ని కార్యాలయాల్లోనూ విద్యుత్‌ను నిలిపివేయడంతో ఎక్కడి పనులక్కడే స్తంభించిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా విభాగాల్లో అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహించినప్పటికీ, ఒంటిగంట నుంచి ఒక్కొక్క కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపించివేశారు. కరెంట్ తీసివేసి లైట్లు ఆపివేశారు. దీంతో నిత్యం రద్దీతో కిటకిటలాడే జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం బోసిపోయి కనిపించింది. సర్కిల్, జోనల్‌కార్యాలయాలనుంచి ప్రధాన కార్యాలయం వద్దకు భారీసంఖ్యలో చేరుకున్న ఉద్యోగులనుద్దేశించి బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్ ప్రసంగించారు. డిమాండ్లు నెరవేరేంతవరకు, సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు వెనక్కు తగ్గేది లేదని పిలుపునిచ్చారు. కాగా టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌కలెక్టర్ల తరపు ప్రతినిధులతో మంగళవారం రాత్రి చర్చలు జరిపిన అడిషనల్ కమిషనర్లు సస్పెండ్ చేసిన ఇద్దరు టాక్స్ ఇన్‌స్పెక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించడంతోపాటు ఇతరత్రా డిమాండ్లపైనా కమిషనర్ సానుకూలంగా స్పందించినందున సమస్య సమసిపోయిందని ప్రకటించారు. అందుకనుగుణంగా బుధవారం ఉదయం కొందరు టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌కలెక్టర్లు విధులకు కూడా హాజరయ్యారు. జోక్యం చేసుకున్న కొందరు యూనియన్ నేతలు డ్యూటీల్లో ఉన్నవారందరినీ వెనక్కు పిలిపించి, కార్యాలయాలనూ బంద్ చేయించారు.
బదిలీ చేయాల్సిందే: బీఎంఎస్
కమిషనర్‌ను బదిలీ చేయడమే తమ ఏకైక డిమాండ్ అని, అది నెరవేరేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని బీఎంఎస్ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి వినయ్‌కపూర్ స్పష్టం చేశారు. సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ , నెలనెలా ఏదో ఒక సమస్యతో కమిషనర్ వద్దకు వెళ్లలేమని, ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేయాలనేదే తమ ఏకైక డిమాండ్ అన్నారు.
ఉద్యోగులపై అదనపు భారం మోపవద్దు: టీజేఏసీ
ఉద్యోగులపై మోయలేని భారాన్ని మోపవద్దని తెలంగాణ మునిసిపల్ జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య, తెలంగాణ జీహెచ్‌ఎంఈయూ వర్కింగ్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్, ప్రధాన కార్యదర్శి అమరేశ్వర్ , జేఏసీలోని వివిధ పక్షాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరిపిన వారు ఉద్యోగుల ‘జాబ్‌చార్ట్’ ప్రకారమే పనులప్పగించాలన్నారు. అర్హులైనవారికి వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు. మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై కార్యాచరణను గురువారం ప్రకటించనున్నట్లు సీఐటీయూ ఒక ప్రకటనలో పేర్కొంది.
మేయర్ ప్రకటనతో దుమారం..
ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు మేయర్ పేరిట వెలువడిన సమాచారం దుమారం రేపింది. 9వ తేదీన మృతిచెందిన ఏఎంసీ అశోక్‌కుమార్ ఆత్మశాంతికోసం బుధవారం జరగాల్సిన స్టాండింగ్‌కమిటీ తీర్మానాలపై సమీక్షను మేయర్ వాయిదా వేసినట్లు మీడియా ప్రతినిధులకు ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయి. దాంతోపాటే ఉద్యోగుల నిరసనకు మద్దతు తెలుపుతున్నట్లు కూడా పేర్కొనడంతో మేయర్, కమిషనర్ మధ్య వార్ జరుగుతోందా అన్న ప్రశ్నలు తలెత్తాయి.
సమస్యలుంటే పరిష్కరిస్తాం: సోమేశ్‌కుమార్
ఉద్యోగులకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని జీహెచ్‌ంఎసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. యూనియన్ నాయకులు చర్చలకు వస్తే మాట్లాడేందుకు అభ్యంతరం లేదని, సమస్యలుంటే పరిష్కరిస్తామన్నారు.
స్తంభించిన జీహెచ్‌ఎంసీ
Published Wed, Nov 12 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement
Advertisement