
'రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని వైఎస్సార్ సీపీ నాయకుడు పార్థసారథి పునరుద్ఘటించారు. రియల్ ఎస్టేట్ కోసమే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆర్భాటాలు మానేసి అన్నిప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
- రియల్ ఎస్టేట్ కోసమే రాజధాని నిర్మిస్తున్నట్టు చంద్రబాబు ఒప్పుకున్నారు
- భ్రమరావతి నిర్మిస్తూ భ్రమలు కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు
- మీరు సంపద సృష్టించేది రాష్ట్రానికా, మీ బినామీదార్లకా?
- సింగపూర్ కంపెనీలు, రాజధాని చుట్టూ భూములు కొన్న మీ తాబేర్ల ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారు
- మీ ఆలోచనా విధానాన్ని స్పష్టంగా వెల్లడించండి
- తన కారణంగా రైతులు, మహిళలు ఎంత మోసపోయారో చంద్రబాబుకు ఇంకా అర్థం కావడంలేదు
- రాజధాని కోసం రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారనడం బూటకం
- ఇబ్బందులకు గురి చేస్తారనే భయంతోనే రైతులు భూములు ఇచ్చారు
- శంకుస్థాపనకు రూ.9 కోట్ల కంటే అదనంగా ఖర్చు పెట్టకుండా చేయగలరా అని సవాల్ చేస్తున్నాం
- శంకుస్థాపన ఖర్చు స్పాన్సర్స్ ఇచ్చినట్టయితే వాళ్లు ఏం ఆశించి ఖర్చు చేస్తున్నారో చెప్పాలి
- కృష్ణా నది ఒడ్డున ఉన్న అక్రమ నిర్మాణాలను కూలివేయమన్న చంద్రబాబు తన కోసం గెస్ట్ హౌస్ కోసం రూ. 70 కోట్లతో రోడ్డు నిర్మించారు
- తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు