విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ
మౌలాలి: చంద్రగిరి కాలనీలోని డీఏవీ పాఠశాలలో చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సోమవారం పలువురు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వీరికి పలు రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన కొనసాగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలుమార్లు ప్రిన్సిపాల్ సీతాకిరణ్ ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయిత్నించినా వారు వినలేదు.
ఒక దశలో పాఠశాల వాహనాలను సైతం అడ్డుకున్నారు. చివరకు డీసీపీ రమారాజేశ్వరి నేతృత్వంలో మల్కాజగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి, నేరేడ్‌మెట్ ఎస్‌ఐ చంద్రబాబులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులతో చర్చించారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా ఈ నెల 11న పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బాత్‌రూంకు వెళ్లగా 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి అక్కడికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది.
12, 13 తేదీల్లో కూడా ఇవే సంఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలిసి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో పాఠశాల యాజమాన్యం స్పందిచండం లేదని ఆరోపిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి పాఠశాల ప్రిన్సిపాల్ సీతాకిరణ్‌ను కోరారు. కాగా బాలికలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థులను గుర్తించి తగినచర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.
డీఏవీ హైస్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన
Published Tue, Nov 25 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement