సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ డ్రైవర్ అకృత్యాలపై కోర్టు తీర్పు వెల్లడించింది. గతేడాది డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చుతూ.. శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన డ్రైవర్ రజినీకుమార్‌కు నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇదే కేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాదవి రెడ్డిని నిర్ధోషిగా తేల్చింది.
కాగా గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. ఈ విషయమై విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడంతో.. ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అనంతరం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నవంబర్‌లో పాఠశాల తిరిగి తెరుచుకుంది. అక్టోబర్ 19న నిందితుడిని, నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జి హెచ్‌ఎం మాధవిల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆరు నెలల దర్యాప్తు, విచారణ తర్వాత కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది.
చదవండి: దంచికొడుతున్న ఎండలు, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment