DAV school
-
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన.. డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ డ్రైవర్ అకృత్యాలపై కోర్టు తీర్పు వెల్లడించింది. గతేడాది డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రిన్సిపల్ కారు డ్రైవర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చుతూ.. శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన డ్రైవర్ రజినీకుమార్కు నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఇదే కేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాదవి రెడ్డిని నిర్ధోషిగా తేల్చింది. కాగా గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న పోలీస్ స్టేషన్లో నిందితుడిపై కేసు నమోదైంది. ఈ విషయమై విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడంతో.. ప్రభుత్వం స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అనంతరం తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నవంబర్‌లో పాఠశాల తిరిగి తెరుచుకుంది. అక్టోబర్ 19న నిందితుడిని, నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి హెచ్ఎం మాధవిల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఆరు నెలల దర్యాప్తు, విచారణ తర్వాత కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది. చదవండి: దంచికొడుతున్న ఎండలు, ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు.. తస్మాత్ జాగ్రత్త! -
బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్.. పెత్తనమంతా డ్రైవర్‌దే
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్– 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌కు బంజారాహిల్స్ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న స్కూల్లో పని చేస్తున్న డ్రైవర్ రజనీకుమార్ నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత చిన్నారి వయసు ధ్రువీకరణ పత్రాలతోపాటు అడ్మిషన్ ఎప్పుడు పొందింది? తదితర వివరాలతో కూడిన పత్రాలను పోలీస్ స్టేషన్లో అందించాల్సిందిగా సూచిస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. డీఏవీ స్కూల్లో పనిచేస్తున్న పరిపాలన సిబ్బంది, టీచర్లు ఈ నెల 25 నుంచి సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో హాజరవుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ స్కూల్ అనుమతులు రద్దు చేయడంతో ఈ స్కూల్‌కు చెందిన సిబ్బంది, టీచర్లు తమ హాజరును సఫిల్‌గూడ డీఏవీ స్కూల్లో వేయిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న బంజారాహిల్స్ స్కూల్‌ను బుధవారం డీఏవీ స్కూల్ డైరెక్టర్ నిషా తనిఖీలు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పాఠశాలలో 30 సీసీ కెమెరాలు ఉండగా అందులో వీరు చేసిన తనిఖీల్లో 12 కెమెరాలు పని చేస్తున్నట్లు తేలింది. చాలా కెమెరాలకు వైర్లు తెగి పడి ఉండటాన్ని గుర్తించారు. ఇదేమిటని ఆరా తీయగా వీటి నిర్వహణ మొత్తం అత్యాచార నిందితుడు రజనీకుమార్‌దేనని సిబ్బంది ఆమె దృష్టికి తీసుకొచ్చారు. సీసీ కెమెరా నిర్వహణ మొత్తం తన చేతుల్లోనే ఉంచుకున్నాడని ఆరోపించారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరగాలన్నా పెత్తనమంతా రజనీకుమార్‌దేనని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పేరుకు మాత్రమే ప్రిన్సిపాల్ ఉండగా పెత్తనమంతా రజనీకుమార్‌దేనని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. బాత్రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పని చేయడం లేదని తనిఖీల్లో తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో స్కూల్ ప్రారంభం కానుండగా ఇక్కడ మార్పులు చేయాల్సిన అవసరముందని గుర్తించారు. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు -
చర్చలు సఫలం.. వారంలో డీఏవీ స్కూల్ రీఓపెన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వారం రోజుల్లో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరిచే విషయంపై.. విద్యాశాఖ కమిషనర్‌తో డీఏవీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. కమిషనర్‌తో భేటీ అనంతరం పలు వివరాలు వెల్లడించారు పేరెంట్స్. ‘కమిషనర్‌కు అన్ని విషయాలు తెలియజేశాం. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ మేనేజర్ శేషాద్రి ఏం చెప్పారంటే.. ‘కమిషనర్ దేవసేనను మా డీఏవీ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చాం. ఘటనపై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్‌తో కలిపి మా వినతిని కూడా అందించాం. గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్‌లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.’ అని కమిషనర్ భేటీ అనంతరం వెల్లడించారు డీఏవీ స్కూల్ మేనేజర్. ఇదీ సమస్య.. హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Hyderabad: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. చిరు ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దారుణం రాజధాని నగరంలో కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రతపై రాజీ పడవద్దని సూచించారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ఎమోషనల్ అయ్యారు. దీనికి కారణమైన కఠినాతి కఠినంగా శిక్షించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ వేదికగా కోరారు. (చదవండి: డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల) మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'బంజారాహిల్స్‌లోని పాఠశాలలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను తీవ్రంగా కలిచివేసింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ఘటన చాలా బాధాకరం. ఇలాంటి ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. అంతే కాకుండా అన్ని విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా.' అంటూ మెగాస్టార్ ఎమోషనలల్ పోస్ట్ చేశారు. Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh — Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022 -
‘మా పిల్లల్ని మరో స్కూల్‌కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్– 14లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను ఇక్కడే రీ ఓపెన్ చేయాలని ఇందుకోసం మూడు ఆప్షన్లు ఇస్తూ తల్లిదండ్రులు అల్టిమేటం జారీ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద డీఏవీ స్కూల్‌కు చెందిన సుమారు 200 మంది తల్లిదండ్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తాము మూడు ఆప్షన్లు ఇస్తున్నామన్నారు. చైల్డ్ వెల్ఫేర్ నుంచి ఒక అధికారి, పేరెంట్స్ కమిటీ నుంచి ఒకరు, ప్రభుత్వం నుంచి మరొకరు, స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఒకరు చొప్పున కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడే స్కూల్ తెరవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రెండు ఆప్షన్లకు ఏ రకంగానూ తాము ఒప్పుకోవడం లేదన్నారు. సీబీఎస్ఈ విద్యార్థులను స్టేట్ సిలబస్ పాఠశాలల్లోకి చేర్చడం కుదరని పని అన్నారు. మెరీడియన్ స్కూల్లో చేర్చడానికి కూడా అది తాహత్తుకు మించిన వ్యవహారమవుతుందని తల్లిదండ్రులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకొని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఎస్ఈ స్కూళ్లలో సర్దుబాటు చేస్తాం ! బంజారాహిల్స్‌లోని డీఏవీ విద్యార్థులను సీబీఎస్ఈ స్కూళ్లలోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలకు తీసుకుంటామంటున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డీఏవీ పాఠశాల గుర్తింపు రద్దుతో పాటు పాఠశాలను మూసి వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన రగులుకుంది. ఈ పాఠశాల విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాల మూసివేత, ఇతర పాఠశాలల్లో సర్దుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పాఠశాలకు అయిదు కిలో మీటర్ల పరిధిలోని స్కూల్స్ మేనేజ్మెంట్లతో సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఆయా స్కూళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తామంటున్నారు. వారి అభీష్టం మేరకు ఆయా స్కూళలో చేరి్పంచే విషయంపై నిర్ణయం తీసుకుంటామని హైదరాబాద్ డీఈఓ రోహిణి స్పష్టం చేశారు. మంత్రి సబితారెడ్డికి కృతజ్ఞతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మా బాధలు వింటూ తగిన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్ ఇక్కడే రీ ఓపెన్ చేయాలని కోరుతున్నాం. – అంజిబాబు, పేరెంట్ చాలా సమస్యలు వస్తాయి.. వేరే స్కూల్లో చేర్చడమంటే చాలా సమస్యలు వస్తాయి. అక్కడి వాతావరణం అలవాటు పడటం మరింత కష్టం. ఆన్లైన్ క్లాస్‌లకు మేం ఒప్పుకోం. – సుజాత, పేరెంట్ డ్రైవర్‌ను ఉరి తీయాలి పిల్లలు మరో పాఠశాలకు వెళ్లడం కుదరదు. అడ్మిషన్లు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి. అంత ఫీజులు చెల్లించుకోలేం. కొత్త మేనేజ్మెంట్తో డీఏవీ స్కూల్‌నే కొనసాగించాలి. – మాతంగి హంస, పేరెంట్ -
విద్యాబుద్ధులు నేర్పే బడుల్లో దారుణాలు
-
DAV స్కూల్ గుర్తింపు రద్దుతో అయోమయంలో పేరెంట్స్
-
డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల
హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. సదరు స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదన్నారు. చదవండి: మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్ ‘డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరమైన సంఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నా. ఎంతో ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు జోహర్లు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించినవారమవుతాం’ అన్నారు. #DAVPublicSchool pic.twitter.com/JLpFVpRLLp — Sekhar Kammula (@sekharkammula) October 21, 2022 -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
Hyderabad: లైంగిక వేధింపుల ఘటన.. బీఎస్‌డీ డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని బీఎస్‌డీ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. డ్రైవర్ రజినీకుమార్ అరాచకాలను స్కూల్లో పనిచేసే టీచర్లు విద్యాశాఖ అధికారులకు తెలిపారు. అతనిపై ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. పాఠశాలలో చాలా మంది విద్యార్థినులపై అతడు లైగింక వేధింపులకు పాల్పడినట్లు అధికారులు విచారణలో గుర్తించారు. విద్యార్థులు, టీచర్ల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. స్కూల్, బయట ఉన్న సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వేరే స్కూళ్లలో సర్దుబాటు పాఠశాల గుర్తింపు రద్ధు చేయడంతో విద్యార్థులు నష్టపోకుండా వాళ్లను వేరే స్కూళ్లలో సర్దుబాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని స్పష్టం చేశారు. కమిటీ ఏర్పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత ప్రకటించారు . ఈ కమిటీలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, పోలీస్ విభాగంలో మహిళల భద్రతను పర్యవేక్షిస్తున్న డీఐజీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ తన నివేదికను వారం రోజుల్లోగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యతపై ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి హామీపత్రం తీసుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. కట్టలుతెంచుకున్న ఆగ్రహం.. ఎల్కేజీ చదువుతున్న బాలికను రజినీకుమార్ గత రెండు నెలలుగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆమె తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం పాఠశాలకు చేరుకుని నిలదీశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అతనికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో విద్యాశాఖ వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. చదవండి: విద్యార్థినిని వేధిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. చితకబాదిన తల్లిదండ్రులు -
డీఏవీ హైస్కూల్ వద్ద తల్లిదండ్రుల ఆందోళన
విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణ మౌలాలి: చంద్రగిరి కాలనీలోని డీఏవీ పాఠశాలలో చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సోమవారం పలువురు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వీరికి పలు రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఆందోళన కొనసాగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పలుమార్లు ప్రిన్సిపాల్ సీతాకిరణ్ ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయిత్నించినా వారు వినలేదు. ఒక దశలో పాఠశాల వాహనాలను సైతం అడ్డుకున్నారు. చివరకు డీసీపీ రమారాజేశ్వరి నేతృత్వంలో మల్కాజగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి, నేరేడ్మెట్ ఎస్ఐ చంద్రబాబులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులతో చర్చించారు. పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా ఈ నెల 11న పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని బాత్రూంకు వెళ్లగా 9వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి అక్కడికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. 12, 13 తేదీల్లో కూడా ఇవే సంఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలిసి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో పాఠశాల యాజమాన్యం స్పందిచండం లేదని ఆరోపిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. పాఠశాలలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి పాఠశాల ప్రిన్సిపాల్ సీతాకిరణ్ను కోరారు. కాగా బాలికలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన విద్యార్థులను గుర్తించి తగినచర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.