సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వారం రోజుల్లో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరిచే విషయంపై.. విద్యాశాఖ కమిషనర్‌తో డీఏవీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. కమిషనర్‌తో భేటీ అనంతరం పలు వివరాలు వెల్లడించారు పేరెంట్స్. ‘కమిషనర్‌కు అన్ని విషయాలు తెలియజేశాం. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
స్కూల్ మేనేజర్ శేషాద్రి ఏం చెప్పారంటే..
‘కమిషనర్ దేవసేనను మా డీఏవీ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చాం. ఘటనపై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్‌తో కలిపి మా వినతిని కూడా అందించాం. గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్‌లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.’ అని కమిషనర్ భేటీ అనంతరం వెల్లడించారు డీఏవీ స్కూల్ మేనేజర్.
ఇదీ సమస్య..
హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Hyderabad: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో?
Comments
Please login to add a commentAdd a comment