
స్కూళ్ల వద్దే బస్‌పాస్‌లు
►గ్రేటర్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు
►60 వేల మందికి ఉచిత బస్‌పాస్‌లు
►15 లక్షల మందికి పాస్‌లే లక్ష్యం...
సిటీబ్యూరో: విద్యార్థుల బస్‌పాస్‌ల కోసం గ్రేటర్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది సుమారు 15 లక్షల మందికి వివిధ రకాల బస్‌పాస్‌లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది 13.8 లక్షల మంది విద్యార్థులకు పాస్‌లను అందజేయగా, ఈ ఏడాది మరో 1.2 లక్షల మంది అదనంగా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు ఉచిత, రూట్, స్టూడెంట్ జనరల్, స్టూడెంట్ గ్రేటర్, స్టూడెంట్ స్పెషల్, స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్, డిస్ట్రిక్ట్, తదితర కేటగిరీల పాస్‌ల కోసం ఈనెల 10 నుంచి తెలంగాణ ఆర్టీసీ వెబ్‌సైట్ జ్టి్టp:// ౌn జీn్ఛ. ్టటట్టఛిp్చటట. జీn లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, విద్యాసంస్థల నిర్ధారణ అనంతరం 4 రోజుల వ్యవధిలో పాస్‌లు జారీ చేస్తారు. ఆర్టీసీకి వచ్చిన దరఖాస్తులను స్టూడెంట్ కోడ్ నెంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో ఆయా విద్యాసంస్థలు నిర్ధారించుకొని తిరిగి ఆర్టీసీకి ఫార్వర్డ్ చేసే సదుపాయం ఉంది. బోగస్ పాస్‌ల ఏరివేతలో భాగంగా విద్యాసంస్థల ఆన్‌లైన్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు.
ఉచిత పాస్‌లపై స్పెషల్ క్యాంపెయిన్...
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 65 వేల మంది విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు అందజేసేందుకు ఆర్టీసీ ఈ నెల 15 నుంచి 30 వరకు ఉచిత బస్‌పాస్ పక్షోత్సవాలు నిర్వహించనుంది. నగరంలోని అన్ని డిపోల మేనేజర్‌లు, అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి ఉచిత పాస్‌ల కోసం పిల్లల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 12 ఏళ్ల వయస్సు వరకు బాలురకు, వయస్సుతో నిమిత్తం లేకుండా పదో తరగతి వరకు బాలికలకు ఆర్టీసీ ఉచిత పాస్‌లు అందజేయనున్నట్టు ఆర్టీసీ ఈడీ తెలిపారు.
బస్సు పాస్ జారీ కేంద్రాలివే..
నగరంలోని సికింద్రాబాద్ రెతిఫైల్, గౌలిగూడ సీబీఎస్, సనత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఇబ్రహీంపట్నం, అఫ్జల్‌గంజ్, ఈసీఎల్ క్రాస్‌రోడ్స్, మెహిదీపట్నం, ఉప్పల్, చార్మినార్, మేడ్చల్, కాచిగూడ, కూకట్‌పల్లి బస్‌స్టేషన్, షాపూర్‌నగర్, బీహెచ్‌ఈఎల్–కీర్తిమహల్, హయత్‌నగర్, శంషాబాద్, మిధాని కేంద్రాల నుంచి బస్‌పాస్‌లు పొందవచ్చు.
అడ్మినిస్ట్రేటివ్ కోడ్ తప్పనిసరి....
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా ఆర్టీసీ నుంచి బస్‌పాస్ కోడ్ పొందాలి. ఇందుకోసం విద్యాసంస్థలు సకాలంలో అడ్మినిస్ట్రేటివ్ ఫీజు చెల్లించి కోడ్‌ను పునరుద్ధరించుకోవాలని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. పాత కోడ్ పునరుద్ధరణ, కొత్త కోడ్ తీసుకునేందుకు జూబ్లీబస్‌స్టేషన్, 2వ అంతస్తులోని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెం.8008204216ను సంప్రదించాలి.