అద్దె చెల్లిస్తే ఇల్లు సొంతం!
కొత్త విధానానికి ప్రభుత్వ యోచన
గ్రేటర్‌లోని పేద ప్రజలకు దశలవారీగా రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం.. మధ్య తరగతి వారికి కూడా సొంతిల్లు కల్పించాలనే యోచనలో ఉంది. అందుకు తగిన విధివిధానాలు రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. నగర ంలో ఇళ్లు లేని వారిలో నిరుపేదలతో పాటు లక్షల సంఖ్యలో దిగువ, మధ్యతరగతి వారున్నారు. వీరు నెలకు రూ. 3 వేల నుంచి రూ. ఏడెనిమిది వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని వీరు కడుతున్న అద్దె కంటే 20 శాతం అదనంగా నెలానెలా (అద్దెలాగే) ప్రభుత్వానికి చెల్లించే ఏర్పాటు చేస్తారు.
తద్వారా నిర్ణయించిన ధర మేరకు అలా పది, పదిహేనేళ్లు అద్దె చెల్లిస్తే ఇళ్లు వారి సొంతమవుతాయి. ఈ దిశగా ఎంతమందికి ఎలాంటి ఇళ్లు అవసరమవుతాయనే దిశగా అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వం పేదల కోసం ఐడీహెచ్ కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లకు సగ టున రూ. 8 లక్షల వరకు ఖర్చవుతోంది. ఆ మోడల్‌లో నిర్మించే ఇళ్లలో మధ్య తరగతివారు ఉండేందుకు కూడా మొగ్గుచూపుతారనే అంచనాలున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ పద్ధతిలో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని వృత్తుల్లోని వారు నిర్ణయించిన కనీస ధరను ఏకమొత్తంగా చెల్లిస్తే.. మిగతా ఖర్చు ప్రభుత్వమే భరించి వారికి సొంత ఇళ్లను సమకూర్చాలనే యోచనలో కూడా ఉన్నారు.
జీహెచ్‌ఎంసీ కార్మికులకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు..?
వీటితోపాటు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం ద్వారా నగరంలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. కాగా, వాటిలో దాదాపు 20 వేల ఇళ్లు లబ్ధిదారులు లేక ఖాళీగా ఉన్నాయి. వీటిని తమ కార్మికులు, చిరుద్యోగులకు అందజేయాలనే యోచనలో జీహెచ్‌ఎంసీ ఉంది. ఈమేరకు త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను కూడా వేలం పద్ధతిలో విక్రయించాలనే యోచనలో ఉన్నారు. నగరంలో సొంత ఇల్లు లేని వారు ఉండరాదనే ప్రభుత్వ లక్ష్యాన్ని అమలు చేసేందుకు ఇలా వివిధ పద్ధతులను అధికారులు పరిశీలిస్తున్నారు.