పాతనోట్లతో ట్రాఫిక్ చెలాన్లు.. గడువు పెంపు
Published Tue, Nov 15 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
హైదరాబాద్: పాత రూ.500, రూ.1000 నోట్లతో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లు క్లియర్ చేసుకునే అవకాశాన్ని మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు ట్రాఫిక్ డీసీపీ ఎల్‌ఎస్ చౌహాన్ మంగళవారం వెల్లడించారు. తొలుత ఆదివారం నుంచి ఇచ్చిన 48 గంటల గడువు సోమవారం సాయంత్రం తో ముసిగింది. రెండు రోజుల్లోనే 7,013 మంది వాహనదారులు రూ.13.53 లక్షలు చెల్లించారు. ట్రాఫిక్ అధికారుల లెక్కల ప్రకారం రూ.40 కోట్ల మేర ట్రాఫిక్ ఈ-చలాన్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కరెన్సీతో చెల్లింపు గడువు పెంచితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు.
ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ నెల 24 వరకు సమయం పొందారు. వాహనదారులు పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌ల్లో చెల్లించవచ్చని డీసీపీ చౌహాన్ తెలిపారు. వాహనంపై జారీ అయి ఉన్న ఈ-చలాన్‌కు సంబంధించిన ప్రింట్ ఔట్ తీసుకుని చెల్లింపుల కోసం వెళ్ళడం మంచిదని సూచించారు.
Advertisement
Advertisement