తెలంగాణను బీద రాష్ట్రంగా చేసింది కేసీఆరే
బీజేపీ నేత నాగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఖజానాకు తూట్లు పొడిచి బీద రాష్ట్రంగా చేసింది సీఎం కేసీఆరేనని బీజేపీ నేత డా. నాగం జనార్దనరెడ్డి ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై కేసీఆర్‌లో ఆందోళనకరమైన వ్యతిరేకత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం నాగం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం ఏమైనా నల్లధనంపై ఆధారపడిందా అని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థ దానిపైనే ఆధారపడి ఉందని కేసీఆర్ భావిస్తే అంతకంటే పొరబాటు ఇంకోటి లేదన్నారు. ఖజానాకు తూట్లు పడ్డాయని, ఆదాయం పడిపోయిందని చెబుతున్నారని, దానిపై ఎలా ఒప్పిస్తారని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నల్లధనం బయటకు వస్తే దాని ద్వారా లాభపడేది రాష్ట్రాలేనని, సంక్షేమ కార్యక్రమాలు, విద్య,వైద్యం, ఇతర సదుపాయాల కింద వాటికి మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు.
యావత్ దేశాన్నే తన కుటుంబంగా భావిస్తున్న మోదీపై అభాండాలు వేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు. పెద్దనోట్ల రద్దు అనేది నల్లధనంపై నొప్పిలేని లాప్రోస్కోపిక్ సర్జికల్ స్ట్రైక్ చేసినట్లుగా తమ వెద్య పరిభాషలో భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి ఉందని, ఆయా అంశాలపై తాను కోర్టుకు కూడా వెళ్లానని వాటిని నిరూపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మిషన్ భగీరథ కింద పైపుల రేట్లను రెట్టింపు చేయడంతో 40 శాతం వరకు మిగులుతున్నాయని, అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్‌చేశారు. సీఎం క్యాంప్ ఆఫీసులో కాంట్రాక్ట్‌లను పంచిపెట్టారని ఆరోపించారు.