వీడు సామాన్యుడు కాదు..
ఫొటో షూట్స్ పేరుతో వీడియోగ్రాఫర్లకు టోకరా
జంట కమిషనరేట్లలో 10 కెమెరాల చోరీ
నిందితుడిని అరెస్టు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్
రూ.20.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో ఫొటో, వీడియోగ్రాఫర్ల వివరాలు సేకరించడం... ఫోటో/వీడియో షూట్స్ పేరుతో వారిని రప్పించడం... ‘ఫ్రెష్’ అయి రమ్మంటూ కెమెరాలతో ఉడాయించడం... ఈ పంథాలో జంట కమిషనరేట్లలో 10 నేరాలు చేసిన ఘరానా దొంగను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడితో పాటు రిసీవర్‌ను పట్టుకున్నామని, వీరి నుంచి రూ.20.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి మంగళవారం తెలిపారు.
ఆది నుంచి నేరజీవితమే...
అనంతపురం జిల్లా నల్లచెరువు ప్రాంతానికి చెందిన దేవరింటి వినోద్‌కుమార్‌రెడ్డి అలియాస్ వినోద్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. 2004లో హైదరాబాద్ వచ్చిన అతను చిన్నచిన్న ఉద్యోగాలు చేసినా జీతం చాలక సెల్‌ఫోన్ చోరీలు ప్రారంభించాడు. ఇతడిపై మొత్తం 22 కేసులు నమోదు కావడంతో పాటు కేపీహెచ్‌బీలో నమోదైన రెండు, నారాయణగూడలో నమోదైన ఏడు కేసుల్లో శిక్ష కూడా పడింది. వినోద్‌పై నల్లచెరువు పోలీసుస్టేషన్‌లో హిస్టరీ షీట్ సైతం ఉంది.
హోటల్‌లో బస చేసి లాడ్జిల్లో చోరీ...
2014 నుంచి మళ్లీ నగరానికి రావడం ప్రారంభించిన ఇతను నాంపల్లిలోని ప్యాలెస్ హోటల్‌లో బస చేసేవాడు. ఈసారి పంథా మార్చుకుని డిజిటల్, వీడియో కెమెరాలపై కన్నేశాడు. వీటిని తస్కరించడానికి అతను రెండు ‘మార్గాలు’ అనుసరించాడు. నగరంలోని ఫొటో స్టూడియోలకు వెళ్లి ఉద్యోగం కావాలంటూ హెల్పర్‌గా చేరేవాడు. రెండుమూడు రోజుల పాటు యజమాని కదలికల్ని గమనించి అదును చూసుకుని కెమెరాలు, ఉపకరణాలతో ఉడాయించే వాడు. మరోపక్క ఆన్‌లైన్‌లో ఓఎల్‌ఎక్స్, జస్ట్‌డయల్ తదితర సైట్ల ద్వారా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల నెంబర్లు సేకరించే వాడు. వారిని సంప్రదించి ఫోటో/వీడియో షూట్ ఉందంటూ రవీంద్రభారతి, చార్మినార్, గోల్కొండ తదితర ప్రాంతాలకు రప్పించేవాడు. షూట్ ప్రారంభానికి ముందో, పూర్తయిన తర్వాతో వారిని లాడ్జికి తీసుకువెళ్లేవాడు. ఫ్రెష్ అయి వస్తాననో, ఫ్రెష్ అవమంటూనో చెప్పి కెమెరాలతో జారుకునేవాడు. ఇలా నగరంలోని గోపాలపురం, కాచిగూడ, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్, సైఫాబాద్, అంబర్‌పేట, సరూర్‌నగర్, నేరేడ్‌మెట్, రాజేంద్రనగర్‌లతో పాటు నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోనూ 10 చోరీలు చేశాడు.
ఎట్టకేలకు చిక్కిన నిందితుడు...
ఇలా చోరీ సొత్తును పి.లక్ష్మిదాస్ గౌడ్ అనే వ్యక్తికి తక్కువ రేటుకు విక్రయించి సొమ్ము చేసుకునే వాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి, ఎస్సైలు వి.కిషోర్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్ తమ బృందాలతో వలపన్నారు. మంగళవారం వినోద్‌తో పాటు రిసీవర్‌గా వ్యవహరించిన దాస్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.50 వేల నుంచి రూ.5.5 లక్షల వరకు విలువైన 12 డిజిటల్, ఐదు వీడియో కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గోపాలపురం పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ తెలిపారు.