ఖమ్మం జిల్లాతో ఆడుకుంటున్నాయి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాతో ఆటలాడుకుంటున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం ముం పు పేరిట 7 మండలాలను ఏపీ ప్రభుత్వం లాగేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, వెంకటాపురం మండలాలను నూతనంగా ఏర్పాటయ్యే భూపాలపల్లిలో కలపడం సమంజసం కాదన్నారు.
సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాల పునర్‌విభజన ప్రజల అభీష్టం మేరకు శాస్త్రీయ పద్ధతిలో జరగాలని కోరారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వైరాకు బదులు కల్లూరును ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.