కల్తీ నెయ్యి కేంద్రంపై పోలీసుల దాడి
రూ.10 లక్షల విలువ చేసే నెయ్యి, మిషనరీ స్వాధీనం
ఈ నెయ్యి తింటే అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: ప్రజారోగ్యంపై కల్తీకాటు వేస్తోంది. ఉప్పు, పప్పు, పాలే కాదు.. నెయ్యిని కూడా వదలడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ శివారులోని ఓ కల్తీనెయ్యి కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. సుమారు రూ.10 లక్షల విలువ చేసే నెయ్యి సహా మిషనరీలను స్వాధీనం చేసుకున్నారు. మీర్‌పేట పరిధిలోని నాదర్‌గుల్ గ్రామంలో కరీంనగర్‌కు చెందిన మహేష్(25) ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నకిలీ నెయ్యి తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. విషయం తెలిసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌ఓటీ) ఓఎస్‌డీ రామచంద్రారెడ్డి నేతృత్వంలోని ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావ్ బృందం గురువారం కల్తీ నెయ్యి కేంద్రంపై ఆకస్మిక దాడులు నిర్వహించింది.
ఎటువంటి ట్రేడ్ లెసైన్స్ లేకుండానే ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లో ఈ కల్తీ నెయ్యిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రూ.5 లక్షల విలువ చేసే 2,100 కిలోల పామాయిల్, 230 కిలోల కృత్రిమ నెయ్యి, 36 కిలోల డాల్డా, 300 లీటర్ల విలువైన ముడి సరుకు, మూడు ప్యాకింగ్ మిషన్లను, ఒక పెద్ద నెయ్యి బాయిలర్‌తో పాటు 5 లక్షల విలువ చేసే మరో యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న కృష్ణ, లక్ష్మి, దుర్గ బ్రాండ్ల పేర్లతో ప్యాక్ చేసిన నెయ్యి ప్యాకెట్లను కూడా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం నిందితులను మీర్‌పేట పోలీసులకు అప్పగించారు.
ఇది తింటే ప్రమాదం: డాక్టర్ నాగార్జున, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సన్‌షైన్ ఆసుపత్రి
సహజసిద్ధమైన నెయ్యిలో పామాయిల్, డాల్డా కలపడం వల్ల ఆ ఆహార పదార్థం విషతుల్యంగా మారే ప్రమాదం ఉంది. అజీర్తితో పాటు గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో భారీగా కొవ్వు పేరుకుపోయి ఊబకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇది మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.