బంజారాహిల్స్: హుక్కా సెంటర్ల నిర్వాహకులు పోలీసులనే బురిడీ కొట్టించాలనుకుని దొరికిపోయారు. లైట్లు తీసేసి, గేట్లకు తాళాలు వేసి దర్జాగా అర్దరాత్రి దాటిన తర్వాత కూడా హుక్కా సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12 లోని టీజీఐటీ, అర్బన్‌గ్రిల్ హుక్కా సెంటర్లు అర్ధరాత్రి ఒంటి గంటకు మూసివేయాలి. ఎప్పటిలాగే మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ రెండు హుక్కా సెంటర్ల గేట్లను మూసివేసి తాళాలు వేసి లిఫ్ట్‌లు కూడా ఆపేశారు. అంతా బాగానే ఉంది. కానీ, లోపల మాత్రం వందలాది మంది యువతీ యువకులు హుక్కా పీలుస్తూనే ఉన్నారు.
బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ గోవర్ధన్‌రెడ్డి ఈ హుక్కా సెంటర్లలోకి వెళ్లడానికి ప్రయత్నించగా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో వారు పక్కనే ఉన్న కాంప్లెక్స్ పైకి ఎక్కి అక్కడి నుంచి సదరు కాంప్లెక్స్‌లోకి దిగారు. వారు లోపలికి వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో యువత ఉన్నారు. అప్పటికీ సమయం అర్ధరాత్రి 2.30 గంటలు దాటింది. ఇదేమిటని ప్రశ్నిస్తే నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో టీజీఐటీ చెఫ్ రశీద్, రిజ్వాన్, అర్బన్ గ్రిల్ హుక్కా సెంటర్ మేనేజర్ విశాల్‌లను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.