
'పటాస్' సినిమా పోస్టరుపై ఫిర్యాదు
హైదరాబాద్ క్రైం: జాతీయ చిహ్నమైన మూడు సింహాలను అవమానించే విధంగా 'పటాస్' సినిమా పోస్టర్లు ఉన్నాయని నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివరాలు.. దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజధాని సినిమా థియేటర్‌లో పటాస్ సినిమా పోస్టర్లు యువతను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పీఅండ్‌టీ కాలనీ బీజేపీ అధ్యక్షుడు డోర్నాల జయప్రకాష్ చైతన్యపురి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. థియేటర్‌లో ప్రదర్శిస్తున్న పోస్టర్లలో అర్థనగ్నంగా ఉన్న మహిళ జాతీయ చిహ్నమైన మూడు సింహాలపై చేయి వేసి నిల్చొని ఉండటం యువతను పెడదోవ పట్టించే విధంగా ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ పోస్టరులో హీరో ధూమపానం చేస్తూ కనిపించడం అభ్యంతరకరంగా ఉందన్నారు. సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకొని యువత ఇలాంటి సంఘటనలతో తప్పుదోవ పడుతుందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయాన్ని పరిశీలించిన ఎల్‌బీనగర్ ఏసీపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.