
కోటి రూపాయలు కొట్టేసిన నకిలీ బాబా ఇతడే!
పూజల పేరుతో మోసం చేసి ఏకంగా రూ. 1.30 కోట్లతో పరారైన నకిలీ బాబాను పోలీసులు గుర్తించారు. లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదనరెడ్డి ఇంట్లో వాళ్లందరికీ మత్తుమందు ఇచ్చి, దోపిడీకి పాల్పడింది శివ అనే పాత నేరస్తుడని పోలీసులు తెలిపారు. ఇతడు గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహాలో కొంతమందిని మోసం చేసినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండగాంపల్లి గ్రామానికి చెందిన బుడ్డప్పగారి శివ అలియాస్ శివస్వామి, శివబాబా... నకిలీ బాబాగా అవతారమెత్తాడు. గత రెండేళ్ల క్రితం తిరుపతిలోనూ దొంగబాబా శివ హల్‌చల్ చేశాడు. లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 63 లక్షలు కాజేశాడు. అంతేగాక లక్షకు రెండు లక్షలు వస్తాయంటూ ప్రజలను నమ్మించి మోసం చేసేవాడు. ఇతని చేతిలో మోసపోయిన ఓ కుటుంబం తిరుపతి అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.
అయితే తర్వాత ఎలా బయటకు వచ్చాడో, ఇక్కడ ఎలా మోసానికి పాల్పడ్డాడో మాత్రం తెలియలేదు. మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి వాళ్లను పూజల పేరుతో బురిడీ కొట్టించి కోటి రూపాయలకు పైగా సొత్తుతో ఇతగాడు ఉడాయించిన విషయం తెలిసిందే.