పని వాళ్లుగా చేరి.. కానిచ్చేస్తారు | police successfully caught bihar gang in robbery case | Sakshi
Sakshi News home page

పని వాళ్లుగా చేరి.. కానిచ్చేస్తారు

Published Wed, Jul 5 2017 8:26 AM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

పని వాళ్లుగా చేరి.. కానిచ్చేస్తారు - Sakshi

పని వాళ్లుగా చేరి.. కానిచ్చేస్తారు

పంజగుట్ట భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
నలుగురు బిహారీ గ్యాంగ్‌ అరెస్టు, ఒకరు పరారీ
రూ. 65 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

పంజగుట్ట: వారు బిహారీ ముఠా సభ్యులు, విడివిడిగా సంపన్నుల ఇళ్లల్లో వంట పనివారిగా చేరతారు. ఎక్కడ అదను దొరికినా అందరూ కలిసి ఆ ఇంట్లో అందినంత దోచుకుని పరారవుతారు. ఈ నెల 1న బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ –1, నవీన్‌నగర్‌లో బంగారు వ్యాపారి జితేందర్‌ కుమార్‌ గుప్త ఇంట్లో దొంగతనానికి పాల్పడింది కూడా వీరే. ఈ ముఠా సభ్యుల్లో ఐదుగురిని పంజగుట్ట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మంగళవారం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ వెంకటేశ్వర్‌ రావు వివరాలు వెల్లడించారు. నవీన్‌నగర్‌కు చెందిన జితేందర్‌ కుమార్‌ ఆబిడ్స్‌లో బంగారు నగల దుఖానం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 1న అతను కుటుంబసభ్యులతో కలిసి శంషాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తెల్లవారుజామున తిరిగి వచ్చాడు.

ఇంట్లోకి వెళ్లి చూడగా 1.29 కిలోల బంగారం, వెండి, రూ. 4 లక్షల విలువైన వాచీలతో సహా, రూ. 68 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంట్లోకి వెళ్లేందుకు బయో మెట్రిక్‌ సిస్టమ్‌ ఉండడంతో నిందితులు కిచెన్‌ కిటికీ గ్రిల్స్‌ తొలగించి లోపలికి వెళ్లినట్లు నిర్ధారించారు. బీరువా బద్దలగొట్టి ఖరీదైన వస్తువులు మాత్రమే ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పరిచయస్తులే చోరీకి పాల్పడి ఉంటారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. బాధితులను ఆరా తీయగా నెల రోజుల క్రితమే మధ్యవర్తి ద్వారా బిహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన ఉమేష్‌ కుమార్‌ ముఖియా కబాద్‌ను వంట మనిషిగా పెట్టుకున్నట్లు తెలిపాడు. సర్వెంట్‌ క్వార్టర్స్‌లో ఉండే అతను కనిపించకపోవడంతో అతని సెల్‌కు ఫోన్‌ చేయగా స్పందన లేదు. దీంతో అతనే దొంగతనానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తూ మధ్యవర్తి దినేష్‌ ద్వారా అతని వివరాలు సేకరించారు. ఇతనితోపాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లోని సంపన్నుల ఇళ్లల్లో వంట పనివాళ్లుగా చేరిన బిహార్‌కు చెందిన హరేరామ్‌ షానే, ఉపేందర్‌ ముఖియా, రాజేందర్‌ ముఖియా, జోగేందర్‌ ముఖియాల వివరాలు సేకరించారు.

వీరి ఫోన్లు ట్యాప్‌ చేయగా ఒకరి ఫోన్‌ అందుబాటులోకి రావడంతో టవర్‌ లొకేషన్‌ ఆధారంగా నింది తులు చోరీ అనంతరం రాజేందర్‌ ముఖియా ఇంటికి వెళ్లి అక్కడ బంగారం వాటాలు వేసుకుని అక్కడి నుంచి క్యాబ్‌లో వరంగల్‌ చేరుకున్నట్లు కనుగొన్నారు. అక్కడ నుంచి విజయవాడకు వెళ్లి గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం చేరుకున్నట్లు నిర్ధారించా రు. విశాఖపట్నం పోలీ సులకు సమాచారం అందించడంతో అక్కడి పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయడంతో అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇతర ముఠా సభ్యులను పట్టుకున్నారు. నిందితులందరూ సోదరులు, సమీప బంధువులేనని, గతంలోనూ వీరికి నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. వారి నుంచి 1.29 కిలో ల బంగారు, వజ్రాల నగలు, 2.8 కిలోల వెండి, 25 చేతి గడియారాలు, 5 సెల్‌ఫోన్లు, రూ.65వేల నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఇళ్లల్లో పనివా రిని నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నారు. గతంలో నూలంగర్‌హౌస్, బల్కంపేట్‌ ప్రాంతాల్లో ఇదే త రహాలో చోరీ లు జరిగాయన్నారు. 24 గంటల్లో కే సును చేధిం చిన పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్‌ రవీందర్, క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్, ఎస్సైలకు రి వార్డులు అందజేయనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

పక్కాగా దర్యాప్తు
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని నవీన్‌ నగర్‌లో నగల వ్యాపారి జితేందర్‌ కుమార్‌ గుప్త ఇంట్లో దొంగతనం చేసిన ముఠా పోలీసులకు చిక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ పంజగుట్ట పోలీసులు పక్కాగా దర్యాప్తు చేయడం, విశాఖపట్నం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవడంతో నిందితులను పట్టుకోగలిగారు. సాధారణంగా ఇలాంటి చోరీలు జరిగిన వెంటనే పోలీసులు ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లపై నిఘా ఉంచుతారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న దొంగలు తెలివిగా వ్యవహరించారు. నవీన్‌నగర్‌లో రాత్రి 8 గంటలకు దొంగతనం చేసిన నిందితులు అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని తమ సహచరుడి ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు బ్యాగుల్లోకి చోరీ సొత్తును సర్దుకుని మాదాపూర్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఉప్పల్‌కు వెళ్లారు. కాస్సేపు అక్కడ గడిపిన దొంగలు బస్సులో వరంగల్‌కు, అక్కడ నుంచి మరో బస్సులో విజయవాడ చేరుకున్నారు. నగరం నుంచి నేరుగా విజయవాడ వెళ్ళే అవకాశాలు ఉన్నా నిందితులు పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఈ పని చేశారు.

పక్కాగా సాంకేతిక దర్యాప్తు చేసిన పంజగుట్ట పోలీసులు అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటలకు నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్‌ విజయవాడ రైల్వేస్టేషన్‌ దాటి కాస్తా ముందు ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో విజయవాడ నుంచి అటు వైపు వెళ్లే రైళ్ల జాబితా ను పరిశీలించగా, గౌహతి ఎక్స్‌ప్రెస్‌ అర్ధరాత్రి 1.10 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చి, 1.20 గంటలకు బయలుదేరి విశాఖ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ యోగానంద్‌కు విషయం చేరవేశారు. దీంతో అప్రమత్తమైన అక్కడి అధికారులు మరుసటి రోజు ఉదయం విశాఖ రైల్వే స్టేషన్‌ వద్ద కాపుకాశారు.

ఉదయం 7.15కు రైలు ఆ రైల్వే స్టేషన్‌కు చేరుకోగా, అప్పటికే పంజగుట్ట పోలీసులు వాట్సాప్‌ ద్వారా నిందితుల ఫొటోలు, వివరాలను విశాఖ అధికారులకు పంపారు. ఓ వైపు కంపార్ట్‌మెంట్స్‌లో గాలింపు కొనసాగుతుండగానే, పంజగుట్ట అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతూ సమాచారం ఇస్తూనే ఉన్నారు. రైలు కదలడానికి మూడు నిమిషాల ముందు జనరల్‌ బోగీలో నిందితులతో పాటు పూర్తి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement