హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ..కేంద్రాన్ని, ఏపీ సీఎం చంద్రబాబును హైకోర్టు విభజనకు ఒప్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. అందువల్లే న్యాయవాదులు రోడ్డుకెక్కాల్సి పరిస్థితి వచ్చిందన్నారు.
హైకోర్టు కోసం ఢిల్లీలో దీక్ష చేపడుతానంటున్న సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే.. ఆ డిమాండ్ నెరవేరాకే తిరిగి రాష్ట్రానికి రావాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ తొత్తుగా బార్ అసోసియేషన్ మారిందని విమర్శించారు. మీలో చిత్తశుద్ధి ఉంటే ఛలో సెక్రటేరియట్, ఛలో క్యాంప్ ఆఫీస్.. ఛలో టీఆర్ఎస్ ఆఫీస్కు పిలుపునివ్వాలని బార్ అసోసియేషన్కు సవాల్ విసిరారు.
హైకోర్టు విభజన, న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి వెంటనే అఖిలపక్షాన్ని న్యూఢిల్లీకి తీసుకెళ్లాలని కేసీఆర్ను పొన్నం డిమాండ్ చేశారు. న్యాయవాదులు నిరసనలు చేపట్టవద్దంటూ జారీ చేసిన మెమోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.