
ప్రభాస్ సోదరుడికి జైలు శిక్ష
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సోదరుడు ప్రభోద్ ఉప్పలపాటికి చెక్కు బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. అలాగే రెండు నెలల వ్యవధిలో రూ. 80 లక్షల నగదును వ్యాపారవేత్తకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి... ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా చిత్రానికి అతని సోదరుడు ప్రభోద్ నిర్మాతగా వ్యవహారించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారి వద్ద నుంచి ప్రభోద్ రూ. 43 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
ఆ తర్వాత సదరు నగదు చెల్లించాలని వ్యాపారీ... ప్రభోద్పై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో రూ. 43 లక్షల నగదు చెక్కును వారిని ప్రభోద్ అందజేశాడు. కానీ బ్యాంకులో ఆ చెక్కు బౌన్స్ అయింది. ఇదే విషయాన్ని వ్యాపారవేత్త.. ప్రభోద్కు తెలిపారు. ఆ తర్వాత కూడా పలు మార్లు సదరు చెక్కు బౌన్స్ అయింది. దీంతో వ్యాపారవేత్త... పోలీసులకు ఫిర్యాదు చేసి... కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.