నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక
సాక్షి, హైదరాబాద్: నల్సార్ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఆయన మధ్యాహ్నం 3.25 గంటలకు బేగంపేట విమానాశ్రాయానికి చేరుకుంటారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు ఆయనకు విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయన నల్సార్ వర్శిటీకి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాష్ర్టపతితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ చాన్‌సలర్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్త కూడా పాల్గొంటారు. అనంతరం రాష్ర్టపతి సాయంత్రం 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరతారు.
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు అనుమతించండి: ఏపీ సీఎం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో.. నల్సార్ వర్సిటీ తెలంగాణలో ఉన్నందున రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అయితే రాష్ట్రపతికి హైదరాబాద్‌లో స్వాగతం, వీడ్కోలు పలికేందుకు తనను కూడా అనుమతించాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి భవన్‌ను కోరారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున తాను కూడా బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలుకుతానని, అలాగే వీడ్కోలు కార్యక్రమంలో కూడా పాల్గొంటానని చంద్రబాబునాయుడు అధికారులతో పేర్కొన్నారు. దీంతో సీఎం కార్యాలయం అధికారులు అనుమతి కోసం రాష్ట్రపతి భవన్‌కు శుక్రవారం లేఖ రాశారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రపతి అనుమతిస్తే వస్తారు, దానిదేముందని వ్యాఖ్యానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.