చిట్టితల్లికి ఎన్ని చిత్రహింసలో!
మొదటి ఫొటోలో మీరు చూస్తున్నది ఎవరినో తెలుసా? కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో కనీ వినీ ఎరుగని చిత్రహింసలకు గురై.. జీవచ్ఛవంలా ఆస్పత్రిలో పడి ఉన్న ప్రత్యూషనే! అవును.. ఒకవైపు మొహం అంతా కాలిపోయినట్లు ఉండి, ఎముకల గూడులా మారిపోయిన ప్రత్యూష ఒకప్పుడు కుందనపు బొమ్మలా ఇలా చక్కగా ఉండేది. ఈ ఫొటోను, ఇప్పటి ఫొటోను చూస్తే.. అసలు ఆ అమ్మాయేనా ఇలా ఉన్నది అనే అనుమానం రాక తప్పదు. ప్రత్యూష అసలు తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో.. తర్వాత చాముండేశ్వరి అనే మహిళను ఆమె తండ్రి రమేష్ కుమార్ పెళ్లి చేసుకున్నాడు.
వీరిద్దరూ కలిసి ప్రత్యూషతో బలవంతంగా యాసిడ్ తాగించడం, సిగరెట్లతో కాల్చడం లాంటి వికృత చర్యలకు పాల్పడ్డారు. దాంతో దాదాపు జీవచ్ఛవంలా మారిన ఆమె.. ఎలాగోలా బయటపడింది. ప్రస్తుతం ఆమె సవతి తల్లి, కన్న తండ్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను హాస్టల్లో చేర్చి, మంచి చదువు చెప్పిస్తామని.. మంచి అబ్బాయిని చూసి తన సొంత ఖర్చుతో పెళ్లి చేయిస్తామని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
ఈమే బతికుంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్నమహిళే ప్రత్యూష అసలు తల్లి. ఈమె ఆత్మహత్య చేసుకోవడం వల్లే రమేష్ కుమార్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాముండేశ్వరి అనే ఆ మహిళ.. ప్రత్యూషను కన్న కూతురిలా చూడకుండా, ఇంట్లో ఆమెను భారంగా భావించింది. దాంతో చిత్రహింసల పాలు చేసింది.
- వాసుదేవరెడ్డి, సాక్షి టీవీ