జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఉపముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ. చిత్రంలో ఈటల
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని, ఎగ్జిబిషన్ సొసైటీ కింద నడిచే కళాశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సోమవారం 78వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కడియం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ కింద పనిచేసే విద్యా సంస్థలను పటిష్టం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీ కింద పనిచేసే 18 కళాశాలల్లో ఒకటి, రెండు మినహా అన్నీ బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని చెప్పారు. సొసైటీ ఆదాయంతో నడిచే కళాశాలలను ప్రభుత్వం నడిపించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సొసైటీ అంగీకరిస్తే ప్రభుత్వమే ఖాళీగా ఉన్న అధ్యాపకుల భర్తీ, కనీస సదుపాయాల కల్పన చేపడుతోందన్నారు. కళాశాలలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఇష్టంగా లేకుంటే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికైనా ప్రతిపాదనలు పంపాలని కోరారు.
స్టాల్స్ సంఖ్య పెంచుతాం: ఈటల
స్టాల్స్ నిర్వహణ కోసం దరఖాస్తులు విపరీతంగా వస్తున్నాయని, ఈ సారి పది వేల దరఖాస్తులు వచ్చాయని సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో స్టాల్స్ సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. 70 శాతం స్టాల్స్ నిర్వాహకులు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకునేందుకు మూడు తరాలుగా వస్తున్నారని చెప్పారు.
ఈ సొసైటీ కింద 18 కళాశాలలు కొనసాగుతున్నాయని, విద్యా సంస్థల నిర్వహణ కోసం పాటుపడుతున్న ఎగ్జిబిషన్ లీజు 50 సంవత్సరాల పాటు పర్మినెంట్‌గా కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. నుమాయిష్ హెరిటేజ్ ఈవెంట్ లాంటిదని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎన్‌విఎన్ చార్యులు అన్నారు. సందర్శకులకు ఉచిత వైఫై సేవలు, ఉచిత పార్కింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నరోత్తమరెడ్డి, సంయుక్త కార్యదర్శి వంశీ తిలక్, కోశాధికారి సి.హెచ్. రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment