బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం
♦ రూ.8,832.15 కోట్లతో ఉప ప్రణాళిక అమలు
♦ బీసీ సబ్ ప్లాన్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించి.. రుణాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో బీసీలకు ఉప ప్రణాళికను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆదివారం సబ్ ప్లాన్ అమలుపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2016-17లో బీసీ సబ్ ప్లాన్‌కు రూ.8,832.15 కోట్లు కేటాయించామన్నారు. బీసీల్లో మత్స్యకారులు, రజకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రుణాలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ఉపాధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించి, రూ.126.79 కోట్లను పంపిణీ చేశామని వివరించారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన వర్గాల వారికి వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కిమిడి మృణాళిని, విప్‌లు కూన రవికుమార్, కాగిత వెంకట్రావు, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ రంగనాయకులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.