విద్యార్థులను మేం చేర్చుకోం
- తిప్పి పంపిన కాలేజీలు
- ప్రహసనంగా మారిన ‘ప్రైవేటు’ వైద్య అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య అడ్మిషన్ల ప్రక్రియ గందరగోళంగా మారింది. కౌన్సిలింగ్ ద్వారా కన్వీనర్ కోటా కింద సీట్లు పొందిన విద్యార్థులను చేర్చుకునేందుకు మంగళవారం ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తిరస్కరించాయి. ప్రవేశాలకు బుధవారమే చివరి తేదీ కావడం, కళ్ల ముందే సీటు పోయే పరిస్థితి ఏర్పడటంతో విద్యార్థులు కన్నీరుమున్నీ రవుతున్నారు. యాజమాన్యాలేమో ఫీజులను పెంచకపోతే పీజీ కోర్సులను నడ పలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫీజుల పెంపుపై స్టేను ఉపసంహరించాలంటూ హైకోర్టులో అవి వేసిన పిటిషన్‌పై గురువారం తీర్పు వచ్చే అవకాశముంది.
సుప్రీంకోర్టులో ఓ కాలేజీ యాజమాన్యం వేసిన పిటిషన్‌పై బుధవారమే తీర్పు రావచ్చంటున్నారు. ఫీజులు పెంచకుంటే పీజీ కోర్సులను కొనసాగించలేమని ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు అన్నారు. ‘‘హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. అక్కడా అదే జరిగితే ఈ ఏడాది పీజీ వైద్య కోర్సులను నిలిపేస్తాం. మరో గత్యంతరం లేదు మాకు’’ అని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడంలో వైద్య ఆరోగ్య శాఖ విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. కాలేజీలు విద్యార్థులను చేర్చుకోక పోతే ఏం చేయాలో ఆలోచిస్తున్నామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చెప్పారు.
గడువు పెంచబోమన్న ఎంసీఐ
తొలి విడత కౌన్సిలింగ్ తర్వాత మిగిలి పోయిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని సీట్లకు, ప్రైవేటులో కన్వీనర్ కోటా సీట్లకు ఇటీవల రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించడం తెలిసిందే. సీట్లు దక్కిన విద్యార్థులకు చేరేందుకు మంగళ, బుధ వారాలు సమయమిచ్చారు. ప్రైవేటులో కన్వీనర్ కోటా కింద ఉన్న 368 పీజీ సీట్లల్లో చేరేందుకు మంగళవారం కాలేజీల కు వచ్చిన విద్యార్థులను యాజమాన్యాలు చేర్చుకోలేదు. వివరాలు నమోదు చేసుకుని పంపించారు. పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా ముగించాల్సి ఉంది. ఆ గడువును పొడిగించబోమని ఎంసీఐ తాజాగా స్పష్టం చేసింది. కానీ ఇప్పటికి రెండో విడత కౌన్సిలింగే అయియింది. సీట్లు మిగిలితే మూడు, నాలుగు విడతల కౌన్సిలింగ్ కూడా జరగాల్సి ఉంటుంది. పైగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ, ఇన్‌స్టిట్యూషన్ కోటా సీట్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించి సర్టిఫికేట్లు తనిఖీ చేసి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఇదంతా ఎప్పటికి జరుగుతుందన్నది అంతుబట్టడం లేదు.