హైదరాబాద్: రేబిస్ వ్యాధి లక్షణాలున్న ఓ మూడేళ్ల బాలుడిని చికిత్స కోసం తల్లిదండ్రులు సోమవారం నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ బాలుడికి వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ లేగ దూడను పిచ్చి కుక్క కరిస్తే... ఆ దూడ తల్లి పాలను తాగడం వల్ల రేబిస్ వ్యాధి వస్తుందా అన్నది ఇక్కడ అంతుపట్టని విషయంగా ఉంది. కేసు వివరాలను పరిశీలిస్తే... నల్లగొండ జిల్లా వట్టిపర్తి దుబ్బతండాలో గతేడాది జనవరి 14న ఓ పిచ్చి కుక్క ఒక గేదె దూడను కరిచింది. మూడు నెలల తర్వాత ఆ దూడ రేబిస్‌తో మృతి చెందింది. అయితే, అదే తండాకు చెందిన రమేశ్ అనే వ్యక్తి రేబీస్‌తో మృతి చెందిన లేగదూడ తల్లి గేదె పాలను మూడు నెలల పాటు తన రెండేళ్ల కుమారుడు విష్ణుకు తాగించారు. అయితే ఉన్నట్టుండి విష్ణు గత నాలుగు రోజులుగా జంతువులా ప్రవర్తించడం, ఒంటిపై ఉన్న దుస్తులు చింపేసుకోవడంతో పాటు కుక్క వచ్చిందంటూ గట్టిగా అరుస్తున్నాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి రేబీస్ అనే అనుమానంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో తండ్రి రమేశ్ సోమవారం విష్ణును ఫీవర్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. బాలున్ని పరీక్షించిన వైద్యులు రేబీస్ అనుమానిత కేసుగా గుర్తించి చికిత్సలు అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే కానీ, బాలుడికి రేబీస్ వ్యాధి సోకిందా? లేదా అన్నది తెలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు.
(నల్లకుంట)
బాలుడిలో రేబిస్ వ్యాధి లక్షణాలు
Published Tue, Mar 10 2015 12:19 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
Advertisement