'వెంకయ్య సవాల్ను స్వీకరిస్తున్నా'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు సిద్ధమని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సవాల్ను స్వీకరిస్తున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదాపై బహిరంగ చర్చకు తేదీ, వేదికను వెంకయ్య నాయుడు నిర్ణయించాలని రఘువీరా డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో అబద్ధాలు, ఆర్భాటాలతో పాలన సాగించిందని ఆయన ధ్వజమెత్తారు.
కాగా ఎన్డీయే రెండేళ్ల పాలన సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. హోదాపై తాను కూడా ప్రయత్నిస్తున్నానని అన్నారు. ప్రత్యేక హోదా కంటే కేంద్రం నుంచి ప్రత్యేక మద్దతు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీది అనవసర రాద్దాంతం అని వెంకయ్య వ్యాఖ్యానించారు.