మా విష్ణుపై కేసు పెడతారా....: రఘువీరా మండిపాటు
సాక్షి, హైదరాబాద్:
కల్తీ మద్యం సంఘటనపై రాజకీయం చేయొద్దు. సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. మా పార్టీ నాయకుడు మల్లాది విష్ణు అధికార టీడీపీ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నందునే ఆయనపై కక్ష సాధించడానికి కల్తీ మద్యం ఘటనలో ఇరికించారు... అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం ఇందిర భవన్లో పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కల్తీ మద్యం ఘటనలో మరణించిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విజయవాడ మద్యం కేసుపై సమగ్రంగా అన్ని కోణాల నుంచి విచారణ జరగాలని, బార్ నుంచి సేకరించిన నమూనాలను రెండు మూడు ల్యాబ్లకు పంపాలని, మచిలీపట్నంలో కూడా సంభవించిన మరణంపై కూడా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం ఏడు బ్రాండ్లకు చెందిన మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం వెనుక ఉన్న నిజాలు బయటకు రావాలన్నారు.
విజయవాడ కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి విచారణ జరగకుండానే, అసలు విచారణ ప్రారంభం కాకమునుపే ఆయన బాధ్యుడంటూ ప్రకటనలు ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ అసలు విషయాలను మరుగున పడేస్తున్నారని విమర్శించారు. కేవలం ఆ బార్ నిర్వహిస్తున్న భవనం యజమాని అయినందుకే ఆయన పేరును కేసులో ఇరికించడం మంచిదికాదన్నారు.
బార్లో పని చేస్తున్న సిబ్బందిని పోలీసులతో బెదిరించి, విష్ణుకి వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో జరిగిన కేసుతో పాటు సంబంధిత మంత్రి సొంత ప్రాంతమైన మచిలీపట్నంలో సంభవించిన మరణంపై కూడా విచారణ జరిపించాలని, నిజాలు వెల్లడయ్యేంత వరకు బురదచల్లే కార్యక్రమాన్ని నిలిపివేయాలన్నారు.
తప్పులను కప్పిపుచ్చుకోవడానికే
పదేళ్ల కాంగ్రెస్ పాలనలోని అంశాలపై సమగ్రమైన విచారణ జరిపిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై స్పందిస్తూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలోని అంశాలపై కూడా విచారణ జరిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఏడాది క్రితమే ఎలాంటి విచారనైనా జరిపించుకోవాలని రాతపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిన విషయం చంద్రబాబుకు గుర్తుందా అంటూ ప్రశ్నించారు.